ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ఇండియా , పాకిస్తాన్ వార్ గా అభివర్ణిస్తూ ఉన్నారు బీజేపీ నేతలు. ఈ విషయంలో ఎన్నికల సంఘం కూడా కమలం పార్టీ నేతలకు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ఇండో,పాక్ వార్ గా అభివర్ణించిన బీజేపీ అభ్యర్థి ఒకరికి ఈసీ నోటీసులు ఇచ్చింది. ఇండియాలో ఎన్నికలను ఎదుర్కొనడానికి భారతీయ జనతా పార్టీ పాకిస్తాన్ ను బూచి గా చూపడం ఇప్పుడు క్రమం తప్పనిదిగా మారుతూ ఉంది.
లోక్ సభ ఎన్నికల సమయంలో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు భారతీయ జనతా పార్టీకి అఖండ విజయాన్ని సాధించి పెట్టాయనే విశ్లేషణలు ఉండనే ఉన్నాయి. ఇక రాష్ట్రాల వారీగా ఎన్నికలు జరుగుతున్న వేళ కూడా బీజేపీ పెద్దలు పాకిస్తాన్ ప్రస్తావనే తీసుకు వస్తూ ఉంటారు. ఇటీవలి జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రచారం చేస్తూ.. అక్కడ కశ్మీర్ అంశాన్ని, రామమందిరాన్ని ప్రస్తావించారు. అయితే జార్ఖండ్ లో భారతీయ జనతా పార్టీకి అధికారం దక్కలేదు. చేతిలోని అధికారాన్ని అక్కడ కోల్పోయింది కమలం పార్టీ.
అయితే బీజేపీ తీరు మాత్రం మారుతున్నట్టుగా లేదు. ఢిల్లీలో వెళ్లి పాకిస్తాన్ ను అస్త్రంగా మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. కాంగ్రెస్, ఆప్ లను పాకిస్తాన్ తో పోలుస్తూ..తమను భారతదేశంగా చెప్పుకుంటోంది బీజేపీ. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా అదే రీతిన మాట్లాడారు. కాంగ్రెస్, ఆప్ లు ఇమ్రాన్ ఖాన్ లా మాట్లాడుతూ ఉన్నాయని ఆయన ఎన్నికల ప్రచారం చెబుతున్నారు.
స్థానిక అంశాలను విస్మరించి.. అసెంబ్లీ ఎన్నికల సమయాల్లో బీజేపీ వేర్వేరు అంశాలను ప్రస్తావించి ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో తిరస్కరణకు గురి అయ్యిందనే విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నా, ఢిల్లీలో కూడా బీజేపీ తీరు పెద్దగా మారినట్టుగా కనపడం లేదు!