కర్ణాటక రాజకీయంలో భారతీయ జనతా పార్టీ ముప్పతిప్పలు పడుతూ ఉంది. ఒకవైపు కాంగ్రెస్-జేడీఎస్ లను ముప్పుతిప్పలు పెడుతూ కూడా కర్ణాటక బీజేపీ సాధిస్తున్నది ఏమీలేకుండా పోతోంది. సంకీర్ణ సర్కారును కూలదోయడానికి బీజేపీ అన్ని అవకాశాలనూ ఉపయోగించుకుంటోంది.
అయితే 15 రోజులుగా ఇందుకు సంబంధించిన హైడ్రామా నడుస్తోంది తప్ప బీజేపీ అనుకున్నది మాత్రం జరగడంలేదు. సంకీర్ణ సర్కారు మనుగడ విషయంలో స్పీకర్ పాత్ర అత్యంత కీలకంగా మారింది. ఆయన గట్టిగా నిలబడి ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ ఉన్నారు. స్పీకర్ కు ఉన్న అన్ని అధికారాలనూ ఆయన వినియోగించుకుంటూ ఉన్నారు.
తామేం తక్కువ కాదన్నట్టుగా భారతీయ జనతా పార్టీ వాళ్లు గవర్నర్ ద్వారా ఒత్తిడి తీసుకు వస్తూ ఉన్నారు. విశ్వాస పరీక్షకు అదేశించింది గవర్నరే. అయితే ఆ విశ్వాస పరీక్ష పై ఓటింగ్ జరగకుండా చూసుకుంటున్నారు స్పీకర్. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తీవ్రమైన అసహనాన్ని వ్యక్తంచేస్తోంది.
ఇంకోవైపు స్పీకర్ నుంచి విశ్వాస పరీక్ష విషయంలో డెడ్ లైన్లు కొనసాగుతూ ఉన్నాయి. వాటిని పొడిగించడం మినహా గవర్నర్ ఏం చేయలేకపోతున్నారు. అయితే విశ్వాస పరీక్ష నిర్వహణ విషయంలో గడువులు పెట్టే అధికారం గవర్నర్ కు లేదని, అసెంబ్లీలో ఏం జరగాలో ఆయన ఆదేశించలేని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఇదే సమయంలో విశ్వాస పరీక్షను నిర్వహించకపోవడాన్ని సాకుగా చూపి గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసే అవకాశాలు లేకపోలేదు.
అయితే అదే జరిగితే బీజేపీ తమ వాళ్ల ద్వారా సంకీర్ణ ప్రభుత్వాన్ని రద్దు చేయించిందంటూ కాంగ్రెస్-జేడీఎస్ వాళ్లు జనాల్లోకి వెళ్లే అవకాశం ఉంది. అందుకే రాష్ట్రపతి పాలన విషయంలో తొందరపడలేకపోతోంది కమలం పార్టీ. కొన్నిరోజులు కామ్ గా ఉంటే ప్రభుత్వం పడిపోవచ్చు. అయితే బీజేపీ వాళ్లు అంత వరకూ వేచిచూడలేక, అలాగని తొందరపడి ఏమీచేయలేని పరిస్థితుల్లో కనిపిస్తున్నారు.