'జనసేన పార్టీ నమ్మదగ్గ మిత్రపక్షం కానే కాదు..' అంటూ ఏపీ బీజేపీ నేతల్లో కొందరు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. 'ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా పవన్ కళ్యాణ్‌కి, చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలెక్కువ.. ఆయన్ని బీజేపీ ఎంత కాలం భరిచగలదు.? అన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేం..' అని ఓ బీజేపీ నేత, తన అభిప్రాయాన్ని మీడియా సాక్షిగానే కుండబద్దలుగొట్టేశాడు. టీవీ ఛానల్ చర్చా కార్యక్రమాల్లో ఈ తరహా అభిప్రాయాలు చాలామంది బీజేపీ నేతల నుంచి పరోక్షంగా బయటకొస్తున్నాయి.
మరోపక్క బీజేపీ – జనసేన సమన్వయ సమావేశాలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నాయి.. ఒకపై చాలా జరుగుతాయట ఇలాంటి సమావేశాలు. 2024 ఎన్నికలే లక్ష్యంగా రెండు పార్టీలూ కలిసి పనిచేస్తాయని బీజేపీ, జనసేన నేతలు చెబుతున్నారు. తాజా సమావేశంలో అమరావతి సహా పలు అంశాలపై చర్చించారట. స్థానిక ఎన్నికల్లో కలిసి నడవడం గురించీ చర్చించామని ఇరు పార్టీల నేతలూ చెబుతున్నారు.
ఇదిలా వుంటే, ఇటు బీజేపీ.. అటు జనసేన సంబంధాల్ని తెలుగుదేశం పార్టీ నిశితంగా పరిశీలిస్తోంది. బీజేపీ అధిష్టానం, చంద్రబాబుని దగ్గరకు రానివ్వడంలేదుగానీ.. లేదంటే ఎప్పుడో బీజేపీకి చంద్రబాబు 'సరెండర్' అయిపోయేవారే. చంద్రబాబుతో కలిసే ప్రసక్తే లేదని పవన్ కళ్యాణ్, వైసీపీతో టచ్‌లో వుండబోమని బీజేపీ చెప్పాకనే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరిందని గతంలోనే వున్నాం.
మొత్తమ్మీద, షరతుల్లేవంటూనే షరతలుతో కూడిన పొత్తు కుదిరింది బీజేపీ – జనసేన మధ్య. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో బీజేపీ రూటే సెపరేటు. రాష్ట్రంలో ఓట్లు, సీట్లు మాత్రమే బీజేపీకి కావాలి. ఓట్లు, సీట్లు రాకపోయినా.. అదో రకమైన తృప్తి పొందుతుంటారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇలాంటి రెండు పార్టీలు కలిసి రాష్ట్రంలో రాజకీయం చేస్తామంటే, ప్రజలు నమ్మే పరిస్థితి వుంటుందా.? పైగా, పొత్తు కుదిరిందంటూనే, 'నమ్మదగ్గ మిత్రపక్షం కాదు' అనే సంకేతాలు బీజేపీ పంపడమంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.?