శాసన మండలి రద్దుపై సత్తిబాబు ధీమా ఇదీ.!

ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి రద్దుకి సంబంధించి అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపింది. అయితే, ఈ తీర్మానంపై కేంద్రం ఎలా స్పందిస్తుంది.? అన్నది చర్చనీయాంశంగా మారింది. మామూలుగా అయితే, రాష్ట్రాలు ఇలాంటి…

ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి రద్దుకి సంబంధించి అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపింది. అయితే, ఈ తీర్మానంపై కేంద్రం ఎలా స్పందిస్తుంది.? అన్నది చర్చనీయాంశంగా మారింది. మామూలుగా అయితే, రాష్ట్రాలు ఇలాంటి తీర్మానాలు పంపినప్పుడు వాటికి వ్యతిరేకంగా కేంద్రం స్పందించే అవకాశం వుండదని వైసీపీ వర్గాలు అంటున్నాయి. తెలుగుదేశం పార్టీ మాత్రం, 'అబ్బే, కేంద్రానికి తిప్పి పంపే అధికారం కూడా వుంటుంది' అని చెబుతుండడం గమనార్హం.

ఇదిలా వుంటే, శాసన మండలి రద్దు విషయమై మంత్రి బొత్స సత్యనారాయణ ఓ ఛానల్‌ చర్చా కార్యక్రమం సందర్భంగా ఫోన్‌ ఇన్‌లో మాట్లాడుతూ, రాత్రికి రాత్రి కేంద్రం నిర్ణయాన్ని ప్రకటించేస్తుందనీ, రేపో మాపో మండలి రద్దయిపోతుందనీ తాము చెప్పడంలేదనీ.. ఖచ్చితంగా మండలి రద్దయితీరుతుందనే విషయాన్ని మాత్రం చెప్పగలమని అన్నారు.

'ఒకవేళ ఈ విషయమై టీడీపీ ఇంకో ఆలోచన చేయొచ్చు. కానీ, టీడీపీ చెప్పినట్లు ఏమీ జరగదు. కేంద్రం – రాష్ట్రం మధ్య సత్సంబంధాలు ప్రభుత్వ పరంగా వుంటాయి. అసెంబ్లీనే తీర్మానం చేశాక, శాసన మండలి రద్దుపై కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేక నిర్ణయం తీసుకోకపోవచ్చు' అని బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు.

మొత్తమ్మీద, శాసన మండలి రద్దయిపోయినా ఫర్వాలేదన్న ఆలోచనతో, శాసన మండలిలో నానా యాగీ చేయించిన చంద్రబాబు, ఇప్పుడేమో శాసన మండలి రద్దవకూడదని కోరుకుంటుండడం ఆశ్చర్యకరమే. చంద్రబాబు రెండు నాల్కల ధోరణి ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చింది కాదు.. ఆయనకి అది ఎప్పటినుంచో అలవాటైపోయిన వైఖరే.

ఇదిలా వుంటే, అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలూ తీసుకుని, కేంద్రం వ్యవహరించే తీరుపై ముందస్తుగా సమాలోచనలు జరిపాకనే, శాసన మండలి రద్దుపై వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని ప్రకటించడం.. దానికి అనుగుణంగా శాసన సభలో తీర్మానం చేయడం తెలిసిన విషయాలే. మండలికి ప్రాతినిథ్యం వహిస్తోన్న ఇద్దరు మంత్రులకే కాదు, మండలి సభ్యత్వం వున్న పలువురు వైసీపీ నేతలకూ, అధినేత వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చిన విషయం విదితమే.