బీజేపీ Vs పవన్.. తొలి వ్యతిరేకత బద్వేల్ నుంచే!

ఇన్నాళ్లూ పవన్ కల్యాణ్ ను బీజేపీ ఇష్టం వచ్చినట్టు వాడుకుంది. ఇప్పుడు పవన్ టైమ్ వచ్చింది. బద్వేల్ ఉప ఎన్నికలను అడ్డం పెట్టుకుని టైమ్ చూసి పవన్ బీజేపీని దెబ్బకొడుతున్నారు. ఆ మాటకొస్తే తిరుపతి…

ఇన్నాళ్లూ పవన్ కల్యాణ్ ను బీజేపీ ఇష్టం వచ్చినట్టు వాడుకుంది. ఇప్పుడు పవన్ టైమ్ వచ్చింది. బద్వేల్ ఉప ఎన్నికలను అడ్డం పెట్టుకుని టైమ్ చూసి పవన్ బీజేపీని దెబ్బకొడుతున్నారు. ఆ మాటకొస్తే తిరుపతి ఉప ఎన్నికల విషయంలోనే తమకు సీటివ్వలేదనే అసంతృప్తి పవన్ లో ఉంది. 

ఎక్కడికక్కడ స్థానిక కేడర్ కూడా బీజేపీని పట్టించుకోలేదు. ఫలితం.. డిపాజిట్లు కోల్పోయి నోటాతో బీజేపీ అభ్యర్థి రత్నప్రభ పోటీపడాల్సి వచ్చింది. ఇప్పుడు బద్వేల్ తో ఆ ఎపిసోడ్ సంపూర్ణం అవుతుంది. బద్వేల్ నుంచే పవన్, బీజేపీ చీలిక కు నాందీవాచకం మొదలవుతుంది.

మద్దతు ఇచ్చినట్టే ఇచ్చి డుమ్మా..

బద్వేల్ ఉప ఎన్నికలపై ముందే పవన్ తేల్చేశారు. దివంగత నేత కుటుంబ సభ్యులకే టికెట్ ఇచ్చారు కాబట్టి తాము పోటీలో ఉండేది లేదన్నారు. అదే సమయంలో వారసత్వ రాజకీయాలు తాము ప్రోత్సహించబోమంటూ సరిగ్గా పవన్ రీజన్ ని వ్యతిరేకిస్తూ బీజేపీ బరిలో దిగింది. అక్కడే పవన్ కి బాగా కాలింది. ఓడిపోయే స్థానమని తెలిసి కూడా అక్కడ బీజేపీ అనవసరంగా పోటీలో దిగిందనేది పవన్ వాదన.

తన మాట మన్నించి, తన ప్రకటన తర్వాత టీడీపీ కూడా పోటీ నుంచి తప్పుకుంది, మరి బీజేపీకి ఎందుకీ పట్టుదల అని పవన్ సన్నిహితుల దగ్గర ప్రస్తావించారట. అయితే వీర్రాజు తెలివిగా జనసైనికులు కూడా తమ ప్రచారానికి వస్తారంటూ పవన్ ని లాక్ చేశారు. నాదెండ్ల మనోహర్ కూడా ఆమేరకు హామీ ఇచ్చారంటూ వీర్రాజు ప్రకటించుకోవడం విశేషం.

బద్వేల్ తో బద్నామ్ అవుతారా..?

బద్వేల్ ప్రచారానికి వస్తామని.. అధికారికంగా ఎక్కడా జనసేన నుంచి ప్రకటన వెలువడలేదు. తాము ప్రచారానికి వస్తామని, జనసైనికులు బీజేపీ కోసం పనిచేస్తారని కూడా పవన్ చెప్పలేదు. ఇక్కడేమో ఎన్నికలకు టైమ్ దగ్గరపడుతోంది. ఎంతసేపు వీర్రాజు వస్తారని, ఏవేవో పంచ్ లు వేస్తారని స్థానిక బీజేపీ నేతలు అనుకోవడం మినహా.. ఇంకేమీ జరగడం లేదు. అటు అధినాయకత్వం కూడా ఈ ఎన్నికను బాగా లైట్ తీసుకుంది. కేంద్ర మంత్రులు వస్తారంటూ ప్రచారం చేస్తున్నారు కానీ అది సాధ్యం కాదని తేలిపోయింది.

రాగా పోగా పవన్ ని ప్రచారానికి తీసుకొస్తేనే బీజేపీకి కాస్తో కూస్తో మైలేజీ. కానీ అది కూడా సాధ్యం కావడంలేదు. అధిష్టానం నుంచి ఒత్తిడి ఉన్నా కూడా పవన్ ససేమిరా అని తెగేసి చెప్పడానికే రెడీగా ఉన్నారు. తాను కాదన్న ఎన్నికకు తనతో ప్రచారం చేయించుకోవాలని చూడటం బీజేపీకి సరికాదంటున్నారు పవన్. పవన్ వచ్చి ప్రచారం చేస్తేనే డిపాజిట్లు రావు, మరి ఆయన రాకపోతే.. బీజేపీ నోటాతో కూడా పోటీ పడలేదేమోననే అనుమానాలున్నాయి.

జనసేనానికి కూడా అదే కావాలి. అసలు బీజేపీ సొంత బలం ఏంటో బద్వేల్ బైపోల్ తో తేలిపోతుందని, ఆ తర్వాత వారిపై తన పెత్తనం మొదలు పెట్టాలని ఆయన ఆలోచిస్తున్నారు. ఈ ఎత్తులు, పై ఎత్తుల మధ్య.. బీజేపీ-జనసేన స్నేహానికి బద్వేల్ ఉప ఎన్నిక మంగళం పాడబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి.