ఎన్నాళ్ళకెన్నాళ్ళకు జగన్… ?

వైసీపీ సర్కార్ మూడు రాజధానుల పేరిట కొత్త కాన్సెప్ట్ ని ప్రవేశపెట్టింది. ఫలితంగా దశాబ్దాల కోరిక ఈడేరి విశాఖ కార్యనిర్వాహక రాజధాని అయింది. ఈ మేరకు ఉభయ సభలలో చట్టం కూడా చేశారు. అయితే…

వైసీపీ సర్కార్ మూడు రాజధానుల పేరిట కొత్త కాన్సెప్ట్ ని ప్రవేశపెట్టింది. ఫలితంగా దశాబ్దాల కోరిక ఈడేరి విశాఖ కార్యనిర్వాహక రాజధాని అయింది. ఈ మేరకు ఉభయ సభలలో చట్టం కూడా చేశారు. అయితే ఇది ప్రస్తుతం న్యాయ పరిశీలనలో ఉంది.

విశాఖ ఎప్పటికైనా రాజధానే అని వైసీపీ మంత్రులు, నేతలు తరచూ చెబుతూంటారు. జగన్ కి కూడా విశాఖ మీద మక్కువ ఎక్కువే అంటారు. అలాంటి విశాఖకు జగన్ ముఖ్యమంత్రిగా వచ్చిన సందర్భాలు బహు తక్కువ. ఆయన ఈ ఏడాది మొదట్లో ఒకసారి వచ్చారు.

మళ్ళీ ఇపుడు విశాఖ టూర్ కన్ ఫర్మ్ అయింది అన్నది అధికార వర్గాల సమాచారం. నిజానికి ఆగస్ట్ లోనే సీఎం విశాఖ టూర్ జరగాలి. అది వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. ఇవన్నీ ఎలా  ఉన్నా ఎట్టకేలకు ముఖ్యమంత్రి విశాఖ వస్తున్నారు.

ఈ నెల 23న జగన్ విశాఖ పర్యటన ఖరారు అయింది. ఆ రోజున సీనియర్ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహం సందర్భంగా జగన్ హాజరు అవుతారు. అదే విధంగా విశాఖ నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ముఖ్యమంత్రి శ్రీకారం చుడతారు అంటున్నారు. 

మొత్తానికి చాన్నాళ్ళ తరువాత ముఖ్యమంత్రి విశాఖ వస్తూండడంతో ఆయన చేతుల మీదుగా అనేక కార్యక్రమాలను ప్రారంభింపచేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. 

ఏది ఏమైనా సాగరతీరానికి ముఖ్యమంత్రి రాక అన్నది వైసీపీ శ్రేణులతో పాటు విశాఖ వాసులకు కూడా ఆనందకరంగా మారుతోంది. అదే టైమ్ లో ఆసక్తికరంగానూ ఉంది.