లేట్‌గానైనా, లేటెస్ట్‌గా బీజేపీ-జనసేన కూటమి సరైన నిర్ణయం తీసుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనసేనాని పవన్‌కల్యాణ్‌ను తమ కూటమి సీఎం అభ్యర్థిగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించడం, దాన్ని జనసేన నేతలు ఆహ్వానించడంపై విస్తృతమైన చర్చ జరుగుతోంది.
జనసేనాని పవన్‌కల్యాణ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడంపై సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థులు చురకలంటిస్తున్నారు. ప్రత్య ర్థుల నుంచి అలాంటి స్పందన రాకపోతేనే ఆశ్చర్యపోవాలి. కానీ ఏ మాటకామాట చెప్పాలంటే …పవన్‌ను సీఎం అభ్యర్థిగా తెరపైకి తేవడం రాజకీయంగా బీజేపీ -జనసేన కూటమికి ఎంతో లాభిస్తుంది. మరీ ముఖ్యంగా తిరుపతి ఉప ఎన్నికలో ఈ ప్రకటన ఎంతో ప్రభావం చూపుతుందని చెప్పక తప్పదు.
సోము వీర్రాజు ప్రకటనతో బీజేపీ -జనసేన మధ్య రాజకీయ బంధం మరింత బలపడనుంది. పైగా తిరుపతిలో బీజేపీ అభ్యర్థి రత్నప్రభ తరపున ప్రచారం చేయడానికి పవన్‌కల్యాణ్ రావడం ఆ పార్టీకి కలిసి రానుంది. ఇంతకాలం అంటీముట్టనట్టుగా ఉన్న జనసేన …పవన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో తన వైఖరిని మార్చుకుంది. రత్నప్రభ తమ అభ్యర్థే అన్నట్టుగా జనసేన శ్రేణులు భావించే అవకాశాలు లేకపోలేదు.
ఎందుకంటే తమ అధినేత పవన్ స్వయంగా తిరుపతి వచ్చి ప్రచారం చేసిన తర్వాత కూడా రత్నప్రభకు ఓట్లు పడకపోతే, అది తమకే నష్టమని జనసేనలో అంతర్గత చర్చ జరుగుతోంది. ఇదే టీడీపీతో కలిసి ప్రయాణిస్తే … అంతిమంగా చంద్రబాబు లేదంటే లోకేశ్ మాత్రమే సీఎం అవుతారని జనసేన శ్రేణుల మధ్య చర్చ జరుగుతోంది. సోము వీర్రాజు ప్రకటన మొట్ట మొదట షాక్ ఇచ్చింది టీడీపీకే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎలాగైనా బీజేపీ నుంచి జనసేనను విడగొట్టి, పవన్‌ను తమ వైపు తిప్పుకుని రాజకీయంగా లబ్ధి పొందాలని టీడీపీ, ఎల్లో మీడియా శక్తి వంచన లేకుండా గత కొంత కాలంగా శ్రమిస్తున్నాయి. తాజాగా సోము వీర్రాజు ప్రకటనతో టీడీపీ, ఎల్లో మీడియా ఆశలకు గండికొట్టినట్టైంది.
ఇప్పుడు బీజేపీతో కలిసి కొనసాగడం తమకే ఎక్కువ అవసరమనే ఆలోచనను జనసేనలో సోము వీర్రాజు క్రియేట్ చేయగలిగారు. ప్రతి మనిషిని నడిపించేది ఆశనే. అదే లేకపోతే మానవ సమాజ మనుగడే ఉండదు. బీజేపీ -జనసేన కూటమిని కూడా ముందుకు నడిపించేది పవన్‌కల్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి అనే నినాదమే.