తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్

తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్.. పరిసర ప్రాంతాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మహారాష్ట్ర నాందేడ్ కేసులన్నీ హైదరాబాద్ ఆస్పత్రులకే రావడంతో తెలంగాణలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని అంటున్నారు వైద్యులు.…

తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్.. పరిసర ప్రాంతాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మహారాష్ట్ర నాందేడ్ కేసులన్నీ హైదరాబాద్ ఆస్పత్రులకే రావడంతో తెలంగాణలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని అంటున్నారు వైద్యులు.

కారణాలేంటి..?

మహారాష్ట్ర ప్రభావం..తెలంగాణపై మహారాష్ట్ర ప్రభావం ఎక్కువ. దేశంలోనే కరోనా కేసులు మహారాష్ట్రలో ఎక్కువగా ఉన్నాయి. ఆ రాష్ట్రంలో సరిహద్దు పంచుకుంటున్న తెలంగాణపై కూడా ఇది పరోక్షంగా ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ లో కేసులు ఎక్కువగా పెరగడానికి ఇదే కారణం.

నిర్లక్ష్యం..తొలిదశ కంటే సెకండ్ వేవ్ లో కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. దీనికి కారణం సామాన్య ప్రజల్లో ఉన్న నిర్లక్ష్యమేనంటున్నారు వైద్యులు. మాస్క్ లు లేకుండా తిరగడం, సామాజిక దూరం పాటించకపోవడం, వ్యాక్సిన్ వచ్చేసిందన్న ధైర్యంతో ప్రజలు చేజేతులారా కరోనాబారిన పడుతున్నారని హెచ్చరిస్తున్నారు. అటు ప్రభుత్వాలు కూడా లాక్ డౌన్ లాంటి కఠిన నిర్ణయాలకు వెనకాడుతుండే సరికి ప్రజల్లో భయం లేకుండా పోయిందని అంటున్నారు.

ప్రయాణాలు..అన్ లాక్ తో ఆంక్షలు తీసేసిన తర్వాత ప్రయాణాలు తిరిగి జోరందుకున్నాయి. గతంలో వ్యక్తిగత వాహనాల్లో మాత్రమే ప్రజలు ఒకచోట నుంచి ఇంకో చోటకి వెళ్లారు. ఇప్పుడు ప్రజా రవాణా కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో కదలికలు పెరిగాయి, ఫలితంగా కేసులు కూడా పెరుగుతున్నాయని చెబుతున్నారు.

రెండు వారాలు కీలకం..రాబోయే రెండు వారాల్లో కరోనా కేసులు పీక్ స్టేజ్ కి చేరుకుంటాయని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఇప్పుడున్న జోరు చూస్తుంటే.. కేసుల సంఖ్య మూడింతలు పెరుగుతుందని అంటున్నారు. ఈలోపు వ్యాక్సినేషన్ ని వేగవంతం చేయాలంటున్నారు. గతంలో కరోనాసోకి ఇమ్యూనిటీని పెంచుకున్నవారు, ప్రస్తుతం వ్యాక్సినేషన్ తీసుకుంటున్నవారిని లెక్కేస్తే.. రాష్ట్రంలో 70శాతం మంది సేఫ్ జోన్ లో ఉన్నట్టేనని అందుకే వ్యాక్సినేషన్ పై తొందరపడాలని అంటున్నారు.

వ్యాధి తీవ్ర పెరుగుతోంది..గతంలోకంటే ఇప్పుడు వ్యాధి తీవ్రత మరింత పెరిగిందని అంచనా వేస్తున్నారు వైద్యలు. ఫస్ట్ ఫేజ్ లో కరోనా సోకితే వారం రోజుల తర్వాత తీవ్ర లక్షణాలు కనిపించేవని, సెకండ్ వేవ్ లో ఒకటీ రెండు రోజుల్లోనే తీవ్ర అనారోగ్యం కలుగుతోందని చెబుతున్నారు. స్వీయ జాగ్రత్తలే శ్రీరామ రక్ష అంటున్నారు.