బీజేపీ ఎంపీ జీవీఎల్ నోట వైసీపీ మాట‌

బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు నోట వైసీపీ మాట ప‌దేప‌దే వినిపిస్తోంది. అధికార వికేంద్రీక‌ర‌ణ‌ను తాము స్వాగ‌తిస్తున్న‌ట్టు మ‌రోసారి ఆయ‌న విస్ప‌ష్టంగా ప్ర‌క‌టించారు. అంతేకాదు గ‌తంలో హైద‌రాబాద్ కేంద్రంగా…

బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు నోట వైసీపీ మాట ప‌దేప‌దే వినిపిస్తోంది. అధికార వికేంద్రీక‌ర‌ణ‌ను తాము స్వాగ‌తిస్తున్న‌ట్టు మ‌రోసారి ఆయ‌న విస్ప‌ష్టంగా ప్ర‌క‌టించారు. అంతేకాదు గ‌తంలో హైద‌రాబాద్ కేంద్రంగా జ‌రిగిన అభివృద్ధి వ‌ల్లే సీమాంధ్ర దారుణంగా న‌ష్ట‌పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఇప్పుడు రాష్ట్ర అవసరాలే ప్రాతిపదికగా వికేంద్రీకరణ ఉండాల‌ని, ఒకచోటే కేంద్రీకరిస్తే అన్ని మౌలిక సదుపాయాలు అక్కడే కల్పించాల్సి వస్తుంద‌న్నారు. ఢిల్లీలో త‌న నివాసంలో బుధ‌వారం ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ అనేక అంశాల‌పై స్ప‌ష్ట‌త ఇచ్చారు.

రాజ‌ధాని రాష్ట్ర ప‌రిధిలోని అంశ‌మే

రాజ‌ధాని ఏర్పాటుపై మ‌రోసారి బీజేపీ వైఖ‌రిని ఆయ‌న కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్పారు. రాజ‌ధాని ఎక్క‌డ ఏర్పాటు చేయాల‌నేది  రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమ‌న్నారు. రాజధాని ఎక్కడ ఉండాలో కేంద్రం నిర్దేశించే పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత రాజ‌ధానిపై అధ్య‌య‌నం చేసిన శివరామకృష్ణన్‌ కమిటీ సిఫార్సులను గత ప్రభుత్వం ఏ మాత్రం ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేద‌న్నారు. శివ‌రామ‌కృష్ణ‌న్ కమిటీ చేసిన కొన్ని ప్రతిపాదనలను సీఎం జగన్‌ అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంద‌న్నారు.

జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణ‌యాల‌ను స‌మ‌ర్థించే వ్యాఖ్య‌లు

సచివాలయం కూడా ఒకేచోట ఉండాల్సిన అవసరం లేదని శివ‌రామ‌కృష్ణ‌న్ కమిటీ చెప్పిన విష‌యాన్ని జీవీఎల్ గుర్తు చేశారు. అలాగే   రాజధాని ఒకచోట, హైకోర్టు మరోచోట అనేక దేశాలు, రాష్ట్రాల్లో  ఉన్నాయ‌న్నారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని త‌మ పార్టీ మొద‌టి నుంచి డిమాండ్ చేస్తోంద‌ని, కానీ గత ప్రభుత్వం విస్మ‌రించింద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ఈ మొత్తం వ్యాఖ్యానాలు జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణ‌యాల‌ను స‌మ‌ర్థించేలా ఉన్నాయి.

రాజ‌ధానిలో సామాజిక (కులం) కోణం  ఉండొద్దు

రాజ‌ధాని ఎలా ఉండాల‌నే అంశంపై కూడా జీవీఎల్ బీజేపీ వైఖ‌రిని స్ప‌ష్టం చేశారు. రాజధానిలో ప్రజా ప్రయోజన కోణం ఉండాలే త‌ప్ప‌ రాజకీయ , సామాజిక (కులం) కోణాలు ఉండ‌కూద‌ని తేల్చి చెప్పారు. ఒక‌వేళ  అలాంటి ఆలోచ‌న‌లు ఉంటే తాము స‌మ‌ర్థించ‌లేమ‌న్నారు. అమ‌రావ‌తి రైతుల ఆందోళ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని వారికి ఒక ప‌రిష్కార మార్గం చూపాల‌ని ఆయ‌న సూచించారు.