పేరుకేమో హిందుత్వ వాదం అంటారు. భారతీయత అని అంటారు. అయితే అనైతిక రాజకీయం చేయడంలో మాత్రం కమలనాథులు ఎవరితోనూ తీసిపోవడం లేదు. భారతీయత గురించి మాట్లాడేవాళ్లు నైతికంగా కూడా కరెక్టుగా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే తమ రాజకీయ ప్రయోజనాల దగ్గరకు వచ్చేసరికి అలాంటి విషయాల్లో పట్టింపులు లేనట్టుగా కమలనాథులు వ్యవహరిస్తూ ఉన్నారు. అందులో భాగమే కర్ణాటక వ్యవహారం. మొదటిది కర్ణాటకలో భారతీయ జనతా పార్టీకి మినిమం మెజారిటీ లేదు. సభలో సభ్యుల సంఖ్యను ఎలా కూడి చూసినా బీజేపీకి కనీస మెజారిటీ లేదు.
అయినా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిసినప్పుడు కూడా ఇలానే యడ్యూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే బలనిరూపణలో బోల్తాపడ్డారు. అప్పటికీ, ఇప్పటికీ కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ బలం పెరిగింది పెద్దగా ఏమీలేదు. అయినా మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రజాస్వామ్యం ప్రకారం ఇది సబబు కాదు!
ఇక రెండో విషయం భారతీయ జనతా పార్టీ వాళ్లు కొన్నాళ్ల నుంచి డెబ్బై ఐదేళ్ల వయసు నిబంధన అమలు చేస్తూ ఉన్నారు. ఆ వయసు దాటితే కీలక పదవులు నేతలు ఎవరికీ దక్కవని తేల్చారు. ఈ రూల్ పేరుతో చాలామంది సీనియర్లను పక్కనపెట్టారు. అయితే కర్ణాటకలో మాత్రం డెబ్బై ఆరేళ్ల యడియూరప్పకు మళ్లీ అవకాశం ఇచ్చారు. ఇది కూడా కమలం పార్టీ అవకాశవాదమే.
యడియూరప్పను కాదంటే.. ఆయన బీజేపీలో మళ్లీ చీలిక తీసుకురాగల వ్యక్తే! అందుకే వయసు నిబంధనను పక్కనపెట్టి మళ్లీ ఆయనకే అవకాశం కల్పించారు. తమ అవసరం మేరకు బీజేపీవాళ్లు ఇలా వ్యవహరిస్తుండటం గమనార్హం.