అసెంబ్లీలోనేమో వీడియోలు పెట్టి మరీ వాయిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున అరిచి గోలచేసే వాళ్లనేమో సస్పెండ్ చేసి లోపలకు నోఎంట్రీ అనేసింది అధికార పక్షం. ఇక సభలో ఎంతసేపు ఉంటే అంతగా డ్యామేజ్ కలగడమే తప్ప అంతకుమించి ప్రయోజనం లేదనే విషయాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు బాగా గ్రహించారని పరిశీలకులు ఇప్పటికే తేల్చారు.
అందుకే చంద్రబాబు కూడా అసెంబ్లీకి డుమ్మా కొట్టేసినట్టే! ఒకవైపు బడ్జెట్ సమావేశాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నా చంద్రబాబు నాయుడు సభకు రావడం లేదని తేలుస్తోంది. శని, ఆదివారాల్లో సభ లేదు. సోమవారం నుంచి మళ్లీ సభ ప్రారంభం కాబోతోంది. ఈ నెలాఖరు వరకూ కూడా సభను నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే స్వయంగా చంద్రబాబు నాయుడే సభకు రావడం లేదట.
చంద్రబాబు నాయుడు అమెరికా వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఆరోగ్య పరీక్షల నిమిత్తం చంద్రబాబు నాయుడు యూఎస్ వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే సభ నుంచి వాకౌట్ చేసిన తర్వాత తెలుగుదేశం అటు వైపు వెళ్లడంలేదు. సమావేశాలు ఇంకా జరుగుతున్నా చంద్రబాబు నాయుడు ఇలా విదేశాలకు వెళ్లిపోతున్నారు. దీన్నిబట్టి శాసనసభకు వెళ్లడంపై చంద్రబాబుకు ఎంత ఆసక్తి ఉందో స్పష్టం అవుతోంది.
ఇప్పటికే పలువురు సభ్యులు సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్లిపోతున్నారు. ఇక సభలో టీడీపీ తరఫున కూర్చునేది ఎవరు?