గ్రేటర్ లో గొయ్యి తవ్వుకుంటున్న బీజేపీ

దుబ్బాక రిజల్ట్ ఇచ్చిన ఆత్మవిశ్వాసమో లేక, దేశవ్యాప్తంగా తమకు క్రేజ్ పెరుగుతోందన్న అత్యుత్సాహమో తెలియదు కానీ.. బీజేపీ గ్రేటర్ బరిలో మరింత దూకుడుగా కనిపిస్తోంది. అది ఒక్కోసారి వారి కొంప ముంచేట్టు కనిపిస్తోంది. Advertisement…

దుబ్బాక రిజల్ట్ ఇచ్చిన ఆత్మవిశ్వాసమో లేక, దేశవ్యాప్తంగా తమకు క్రేజ్ పెరుగుతోందన్న అత్యుత్సాహమో తెలియదు కానీ.. బీజేపీ గ్రేటర్ బరిలో మరింత దూకుడుగా కనిపిస్తోంది. అది ఒక్కోసారి వారి కొంప ముంచేట్టు కనిపిస్తోంది.

టీఆర్ఎస్ అభివృద్ధి మంత్రం పనిచేసినా చేయకపోయినా.. బీజేపీ మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ తో నోరుజారి తిప్పలు కొనితెచ్చుకుంటోంది. 

బండికి బండి.. కారుకి కారు..

నోటిఫికేషన్ విడుదలైన తొలి రోజుల్లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇచ్చిన వరద హామీలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ కి గురయ్యాయి. వరదల్లో బండి పోతే బండి, కారు పోతే కారు, ఫర్నిచర్ పోతే ఫర్నిచర్ తిరిగి ప్రభుత్వమే ఇస్తుందని హామీ ఇచ్చి కామెడీ పండించారు సంజయ్. 

మరో అడుగు ముందుకేసి హైదరాబాద్ పరిధిలో వాహనదారుల చలాన్లన్నీ జీహెచ్ఎంసీ కడుతుందని మరో జోక్ వేశారు. ఈ నేలబారు హామీలు బీజేపీ వైపు ప్రజల్ని ఆకర్షించకపోగా నవ్వులపాలు చేశాయి.

జనసేన మద్దతు

గ్రేటర్ బరిలో బీజేపీ విజయావకాశాలు తగ్గితే దానిపై జనసేన మద్దతు ప్రభావం కూడా కచ్చితంగా ఉంటుందనేది విశ్లేషకుల వాదన. జనసేనాని పవన్ కల్యాణ్ పోటీకి దూరంగా ఉన్నా పరిస్థితి మరోలా ఉండేది. ఆయన పోటీ చేస్తానని చెప్పి, టికెట్లు ఖరారు చేసి, చివరకు త్యాగరాజుగా పేరు తెచ్చుకుని నాయకుల్ని నట్టేట ముంచారు. 

ఒక్క ఓటు కూడా బైటకు పోకుండా జనసైనికులంతా బీజేపీకి అండగా నిలబడాలని పవన్ చెప్పిన మాటల్ని వారు ఎంతవరకు పాటిస్తారనేది సందేహమే. తమ చేతికాడి టికెట్లు కొట్టేసిన బీజేపీకి జనసేన నేతలు గుణపాఠం చెప్పాలని అనుకుంటున్నారు. బీజేపీ తరపున పవన్ ప్రచారం చేస్తే మరింత ప్రమాదం ఉంటుందని, ప్రస్తుతానికి ఆయన్ను ఆహ్వానించకుండా జాగ్రత్త పడ్డారు కమలాధినేతలు.

పావురాలగుట్ట..

దుబ్బాక విజేత రఘునందన్ రావు వ్యక్తిగత ఇమేజ్ ని డ్యామేజీ చేయడంతోపాటు.. పార్టీకి కూడా తీవ్ర నష్టం చేకూర్చింది పావురాల గుట్ట వ్యవహారం. కేసీఆర్ ని బెదిరించడానికి నోరు జారిన రఘునందన్.. వైఎస్ఆర్ అభిమానులకు టార్గెట్ అయ్యారు. 

ఆ దురదృష్టకర సంఘటనను.. మరో దురదృష్టకరమైన రీతిలో ప్రజలకు గుర్తు చేసి ఆగ్రహానికి గురయ్యారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ఫలితం ఎలా ఉంటుందనేది త్వరలోనే తెలుస్తుంది. రఘునందన్ రావు వ్యాఖ్యలపై రగిలిపోతున్న వైఎస్ఆర్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు బీజేపీకి గుణపాఠం చెప్పాలనుకుంటున్నారు.

సర్జికల్ స్ట్రైక్స్..

ఇక మూడోది అత్యంత కీలకమైనది సర్జికల్ స్ట్రైక్స్. పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామంటూ మరోసారి నోరు జారారు బండి సంజయ్. ఈ వ్యవహారంతో హిందువుల ఓట్లు హోల్ సేల్ గా తమకి పడతాయని ఆయన భావించినా.. ప్రశాంతంగా ఉన్న భాగ్యనగరంలో మతకల్లోలాలు చెలరేగే ప్రమాదం ఉందన్న మాట మాత్రం వాస్తవం. 

సర్జికల్ స్ట్రైక్స్ ని టీఆర్ఎస్ గట్టిగా తిప్పికొట్టింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యల్ని సమర్థిస్తారా అని ప్రశ్నిస్తూ.. టోటల్ గా బీజేపీ అగ్రనాయకత్వాన్ని ఇరుకున పెట్టారు కేటీఆర్.

చైనాపై సర్జికల్ స్ట్రైక్స్ చేసే దమ్ములేక పాతబస్తీని తెరపైకి తెచ్చారంటూ తీవ్రంగా మండిపడ్డారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. పాతబస్తీలో రోహింగ్యాలు, పాకిస్తానీలు ఉంటే.. ఓటర్ల లిస్ట్ లో వారి పేర్లు చూపెట్టాలంటూ సంజయ్ కు సవాల్ విసిరారు.

మొత్తంగా బీజేపీ విజయాన్ని ఈ అంశాలన్నీ ప్రభావితం చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

గ్రేటర్ గెలుపు ఎవరిది