ఏపీలో బీజేపీ తన ఇంటిని చక్కదిద్దుకునే పనిలో పడింది. ఈ విషయం ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు నియామకం తెలియజేస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల ముందు కాపు సామాజిక వర్గానికి చెందిన గుంటూరు నేత కన్నా లక్ష్మినారాయణను బీజేపీ అధ్యక్షుడిగా అధిష్టానం నియమించింది. ఏపీలో ఒక్క అసెంబ్లీ, ఎంపీ సీటు కూడా గెలవక పోగా…చివరికి కన్నా కూడా పరాజయం పాలయ్యారు. అంతేకాదు, నోటా కంటే అధ్వానంగా బీజేపీకి ఓట్లు రావడం ఆ పార్టీకి మింగుడు పడని అంశం.
కన్నా పదవీ కాలం పూర్తయిన నేపథ్యంలో కొత్త నాయకుడు వస్తారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే తన పదవిని కొనసాగించుకునేందుకు కన్నా విశ్వ ప్రయత్నిం చేసినా ఫలితం దక్కలేదు. కన్నాకు రెండోసారి పదవి దక్కకపోవడానికి …టీడీపీ అధినేత చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు అధిష్టానానికి పెద్ద ఎత్తున వెళ్లడమే అని అంటున్నారు. మరోవైపు అధికార పార్టీ వైసీపీ కన్నా లక్ష్మినారాయణ ముమ్మాటికీ టీడీపీ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నా రంటూ బహిరంగంగానే తీవ్ర విమర్శలు చేసింది.
వైసీపీ విమర్శలతో పాటు అధిష్టానానికి అందిన ఫిర్యాదులకు అనుగుణంగానే కన్నా వ్యవహార శైలి ఉందనేది బీజేపీ శ్రేణుల మాట. ఉదాహరణకు రాజధాని అంశం రాష్ట్ర పరిధిలో ఉంటుందని, దాని గురించి ఎవరూ ఏమీ మాట్లాడవద్దని బీజేపీ అధిష్టానం ఆదేశాలు. కానీ రాజధాని బిల్లులు గవర్నర్‌కు చేరిన నేపథ్యంలో, వాటిపై సంతకాలు చేయవద్దని కన్నా లక్ష్మినారాయణ లేఖ రాయడం తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై బీజేపీ అధిష్టానం కన్నాకు మొట్టికాయలు వేసినట్టు ప్రచారం జరిగింది.
అలాగే రాజధాని బిల్లులు, నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌పై జరిగే టీవీ డిబేట్లలో తమ పార్టీ ప్రతినిధులెవరూ పాల్గొన వద్దని బీజేపీ అధిష్టానం ఆదేశించిన విషయం తెలిసిందే. బీజేపీ అధిష్టానం ఆదేశాలను ఉల్లంఘించిన లంకా దినకర్‌కు పార్టీ తాజాగా షోకాజ్ నోటీసు జారీ చేసింది. బీజేపీ అంతర్గత చర్చల సారాంశాన్ని టీడీపీ నేతలకు చేరవేస్తున్నారనే ఆరోపణలు కూడా లంకాపై ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ దిద్దిబాటు చర్యలు చేపట్టింది.
టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనాచౌదరితో కలిసి చంద్రబాబు అనుకూల వైఖరితో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు, ఫిర్యాదులే కన్నా లక్ష్మినారాయణ పదవికి ఎసరు తెచ్చాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఏపీలో బలపడేందుకు బీజేపీలో ఇతర పార్టీల మూలాలను తొలగించే క్రమంలో బీజేపీ ఒక్కో అడుగు ముందుకేస్తున్నట్టు తెలుస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన సోము వీర్రాజుకు శుభాకాంక్షలందిస్తూ ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు చేసిన ట్వీట్‌లో లోతైన అర్థం దాగి ఉంది.
బీజేపీతో నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న సోము వీర్రాజు నాయకత్వంలో రాష్ట్రంలో బీజేపీ ఒక పెద్ద రాజకీయ శక్తిగా ఎదుగు తుందని జీవీఎల్ అభిప్రాయపడ్డారు. అంటే ఇంత వరకూ ఉన్న వాళ్లకు పార్టీతో అలాంటి అనుబంధం లేదని పరోక్షంగా చెప్పడం ఆయన ఉద్దేశమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 42 ఏళ్ల పాటు సోము వీర్రాజు వివిధ పదవుల్లో నిబద్ధతతో పని చేశా రని చెప్పడం ద్వారా కన్నా, సుజనా లాంటి నాయకులకు ఏం చెప్పాలనుకున్నారో, వాళ్లకు మాత్రమే అర్థమై ఉంటుందం టున్నారు. తమ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి వచ్చిన కొందరు నాయకులకు పాత వాసనలు పోలేదని, అలాంటి వారు తమ వైఖరి మార్చుకోవాలని గతంలో జీవీఎల్ ఘాటుగా హెచ్చరించిన విషయం తెలిసిందే.
సోము వీర్రాజు నియామకంతో అసలు సిసలు బీజేపీ శ్రేణులకు, నాయకులకు గుర్తింపు దక్కుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే తమ వ్యక్తిగత, టీడీపీ ప్రయోజనాలకు బీజేపీని బలి పెట్టాలనుకునే వాళ్ల ఎత్తులు ఇక మీదట చెల్లుబాటు కావని పార్టీ శ్రేణులు ఆనందంగా ఉన్నాయి. మొత్తానికి సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా రావడం టీడీపీ అధినేత చంద్రబాబుకు పెద్ద దెబ్బగానే భావించవచ్చు.