హీరోయిన్ శ్రద్ధాదాస్ సినిమా జర్నలిస్టులకు ఫస్ట్ &లాస్ట్ వార్నింగ్ ఇచ్చింది. ఇంతకూ ఆమె ఆగ్రహానికి కారణం ఏంటి? వార్నింగ్ ఇచ్చేంత తప్పు పని సినిమా జర్నలిస్టులు ఏం చేశారు? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు తెలుసుకోవాలంటే పదండి ముందుకు…
స్టార్‌మా చానల్‌లో త్వరలో బిగ్‌బాస్ తెలుగు సీజన్-4 ప్రారంభం కానుంది. సహజంగా రియాల్టీ షో అంటే ప్రేక్షకులకు ఆసక్తి ఎక్కువే. కరోనా నేపథ్యంలో అసలు ఈ షో ప్రారంభమవుతుందా? లేదా? అని నిన్నమొన్నటి వరకు అందరిలో అనుమానమే. కానీ షో ఉంటుందని, కాకపోతే గతంలో మాదిరిగా మూడు నెలలకు పైబడి ఉండదనే ప్రచారం వెలుగులోకి వచ్చింది. ఇక అందరి దృష్టి షో హోస్ట్, కంటెస్టెంట్లపై పడింది.
మూడో సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన హీరో నాగార్జునే…ఈ షోకు కూడా వ్యవహరించనున్నారని సమాచారం. ఇక కంటెస్టెంట్ల విషయానికి వస్తే పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో హీరోయిన్ శ్రద్ధాదాస్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. తాజాగా అలా ప్రచారం కావడమే ఆమెకు కోపం తెప్పించింది. ఎందుకంటే బిగ్‌బాస్‌కు సంబంధించి తననెవరూ సంప్రదించలేదని, అలాంటప్పుడు ఇక పాల్గొనే ప్రశ్న ఉత్పన్నమే కాదనేది ఆమె వాదన. ఇది నిజమే.
కానీ సోషల్ మీడియాలో తన పేరు విస్తృతంగా ప్రచారం కావడం ఆమెలో అసహనం తెప్పించింది. దీంతో ట్విటర్‌లో ఆమె ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్‌లో ఏమున్నదంటే…
“నిజానిజాలు తెలుసుకుని సినిమా జర్నలిస్టులు వార్తలు రాయాలి. తప్పుడు వార్తలు రాసేవారికి ఇదే నా మొదటి, చివరి హెచ్చరిక. ఇకపై నా గురించి అసత్య, అవాస్తవ వార్తలు ప్రచారం చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా” అని శ్రద్ధా హెచ్చరించారు.
ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రచారానికి ఇప్పుడెందుకు కోపం వచ్చిందో అర్థం కాదు. కొంపదీసి అత్త మీద కోపం దుత్త మీద చూపినట్టు…సినిమా జర్నలిస్టులపై ఆమె కోపానికి ఇతరేతర కారణాలు ఏవైనా ఉన్నాయా? అనే అనుమానం టాలీవుడ్‌లో వ్యక్తమవుతోంది.