పవన్ అంటే బీజేపీలో భయం మొదలైందా!

పవన్ కల్యాణ్ స్పీడ్ పెంచే సరికి ఏపీలో బీజేపీ సర్దుకుంటోంది. మతపరమైన అంశాలపై తప్ప ఇప్పటి వరకూ ఇంకే విషయాలపై కూడా స్పందించని రాష్ట్ర బీజేపీ నేతలు.. ఒక్కసారిగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కు…

పవన్ కల్యాణ్ స్పీడ్ పెంచే సరికి ఏపీలో బీజేపీ సర్దుకుంటోంది. మతపరమైన అంశాలపై తప్ప ఇప్పటి వరకూ ఇంకే విషయాలపై కూడా స్పందించని రాష్ట్ర బీజేపీ నేతలు.. ఒక్కసారిగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కు పెట్టారు. 

ముందు చెత్త వాహనాలతో మొదలు పెట్టారు. కేంద్రం నిధులిస్తుంటే, వైసీపీ చెత్త వాహనాలకు తమ పార్టీ రంగులేసుకుందని రంకెలేశారు సోము వీర్రాజు. దీనికి వైసీపీ మంత్రులు ఘాటుగానే బదులిచ్చారనుకోండి.. అయితే బీజేపీ హడావిడిగా బయటకు రావడానికి మాత్రం పవన్ కల్యాణే కారణం.

దక్షిణాదిలో పాగా వేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్న బీజేపీ.. అన్ని రాష్ట్రాల్లోనూ తమకి ఉపయోగపడేవారితోనే పొత్తులు పెట్టుకుంటూ వస్తోంది. అదే సమయంలో తమ పరపతి కూడా పెంచుకోవాలనుకుంటోంది. ఉమ్మడి ఏపీలో ఓ పెద్దాయన వల్ల పార్టీ ఇప్పటి వరకూ గుర్తింపు తెచ్చుకోలేకపోయిందనే వాదన కూడా ఉంది. 

తెలంగాణలో ఇప్పుడిప్పుడే కమలదళం సోలో పర్ఫామెన్స్ తో రెచ్చిపోతోంది. ఏపీలో ఇంకా ఆ పరిస్థితి లేదు. గతంలో టీడీపీతో కలసి పోటీ చేసి, ఏపీ అసెంబ్లీలో మంత్రులుగా కూడా బీజేపీ నేతలు కూర్చున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరి పోరుతో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా తెచ్చుకోలేకపోయారు. అంతలోనే పవన్ కల్యాణ్ అండ దొరికింది.

పవన్ కి తామేదో సపోర్ట్ ఇచ్చినట్టు బిల్డప్ ఇచ్చి, జనసేన కార్యకర్తలను వాడుకోవాలనే ఎత్తుగడ వేసింది కమలం. తిరుపతి బై పోల్ లో ఆ వ్యూహం ఫలించలేదు. స్థానిక ఎన్నికల్లో బీజేపీ కంటే జనసేన బలం ఎక్కువ అని పవన్ కల్యాణ్ కి తెలిసొచ్చే సరికి ఆయన వేరుకాపురం పెట్టడానికి సిద్ధమయ్యారు. 

బీజేపీని వీలైనంత త్వరగా వదిలించుకోడానికి చూస్తున్నారు. ఈ క్రమంలో సొంతగా జనాల్లోకి వెళ్లేందుకు కార్యక్రమాలు చేపట్టారు. ఇటీవల జరిగిన మీటింగ్ లో రాబోయే రోజుల్లో వైసీపీకి గుణపాఠం చెప్పి జనసేన అధికారం చేపడుతుందని అన్నారే కానీ, బీజేపీ కూటమి గురించి పొరపాటున కూడా ఓ మాట చెప్పలేదు పవన్.

దీంతో సహజంగానే బీజేపీలో అభద్రతా భావం ఏర్పడింది. పవన్ ఎక్కడ తమకి దూరమైపోతారోనన్న అనుమానంతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. వైసీపీపై బీజేపీ కూడా సొంతగా విమర్శలు చేస్తోంది.

వీర్రాజు చెత్త లాజిక్..

ముందుగా చెత్త వాహనాలతో వీర లాజిక్ లు బయటపెట్టారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. కేంద్రం నిధులతో చెత్త సేకరణ కార్యక్రమం చేపడుతున్న వైసీపీ ప్రభుత్వం, వాటిపై వైసీపీ పార్టీ రంగులు ఎందుకు వేసుకుందని నిలదీశారు. ఆఖరికి చెత్త ఎత్తివేసే వాహనాలపై సైతం ప్రధాని నరేంద్రమోదీ ఫొటో పెట్టలేదేంటని విమర్శించారు వీర్రాజు. కేంద్రం నిధులు, రాష్ట్రం నిధులు అంటూ వేరు చేసి.. బీజేపీకి మైలేజీ పెంచాలనేది వీర్రాజు ఆలోచన.

అయితే ఏపీకి బీజేపీ ఎన్ని నిధులిచ్చినా, ఎన్ని కోట్లు కుమ్మరించినా.. ప్రత్యేక హోదా అనే మాట వారి నోటివెంట రాకపోతే మాత్రం అస్సలు లాభం లేదు. చెత్త వాహనాలపై ప్రధాని బొమ్మ వేసుకుని సంతోషపడటం మినహా.. అసెంబ్లీలో సొంత బలంతో కనీసం ఒక్క సీటు కూడా గెలిచే సీన్ బీజేపీకి లేదు. పవన్ కూడా తనకీ పొత్తు వద్దని చెప్పేస్తే.. బీజేపీ ఒంటరిగా మిగిలిపోవాల్సిందే.