పేరు గొప్ప, ఊరు దిబ్బ అనే టైపులో ఉన్న నేతలు ఆంధ్రప్రదేశ్ లో చాలామంది ఉన్నారు. ప్రస్తుతం వీళ్లు రాజకీయ నిరుద్యోగులు. రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపించలేని వ్యక్తులు. కనీసం కేడర్ ను కూడా ప్రభావితం చేయలేని పొలిటీషియన్లు. ఇలాంటి వాళ్లందర్నీ రారామ్మని సాదరంగా ఆహ్వానిస్తోంది భారతీయ జనతాపార్టీ. పార్టీకి ఎంత పనికొస్తారనే విషయాన్ని పక్కనపెట్టి, సంఖ్య పెరిగిందా లేదా అనే విషయాన్ని మాత్రమే చూస్తోంది ఆ పార్టీ.
ఇందులో భాగంగా ఇప్పటికే ఖాళీగా ఉన్న చాలామంది కాంగ్రెస్ నేతల్ని ఆకర్షిస్తున్న బీజేపీ.. తాజాగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపై కన్నేసినట్టు తెలుస్తోంది. అవిభక్త ఆంధ్రప్రదేశ్ కు చిట్టచివరి ముఖ్యమంత్రి ఈయనే. ఓవైపు రాష్ట్రం ముక్కలైపోతుంటే.. సొంత ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని కొత్త పార్టీ పెట్టి భంగపడ్డారు కిరణ్ కుమార్ రెడ్డి. ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరమైన ఈ నేత, మొన్న ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ లో చేరారు. అయితే అది నామ్ కే వాస్తే జరిగిన ముచ్చట. ఆయన ఎలాంటి ప్రచారం చేయలేదు. 2-3 సార్లు టీవీల్లో మాత్రం కనిపించారంతే.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఘోరంగా ఓడిపోయిన తర్వాత నల్లారి ఎప్పట్లానే సైలెంట్ అయ్యారు. ఇప్పుడీ వ్యక్తితో చర్చలు మొదలుపెట్టారు బీజేపీ నేత రామ్ మాధవ్. ఇప్పటికే రఘువీరాతో చర్చలు ముగించిన ఈ నేత, తాజాగా రాయపాటిని కూడా లైన్లో పెట్టారు. ఇప్పుడు నల్లారితో సంప్రదింపులు షురూ చేశారు.
తను బీజేపీతో టచ్ లోకి వెళ్తానని రాయపాటి ఇప్పటికే ప్రకటించారు. అటు రఘువీరా మాత్రం ఈ విషయంలో గుంభనంగా ఉన్నారు. నల్లారి మాత్రం బీజేపీలోకి వెంటనే జంప్ అవ్వాలని భావిస్తున్నారట. మరోవైపు నల్లారి సోదరుడు, ప్రస్తుతం టీడీపీలో ఉన్న కిషోర్ కుమార్ కూడా బీజేపీలో చేరతారని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి నేతల చేరికలతో బీజేపీ ఏమాత్రం లాభపడుతుందో ఆ పార్టీకే తెలియాలి.