రామ్ చరణ్ కు గాయం అవ్వడం వల్లే ఆర్-ఆర్-ఆర్ షూటింగ్ ఓసారి వాయిదాపడింది. పూణె షెడ్యూల్ మొత్తాన్ని పక్కనపెట్టారు. ఆ తర్వాత చాన్నాళ్లు సినిమా షూటింగ్ జరగలేదు. ఈమధ్యే మళ్లీ సినిమా పట్టాలపైకి వచ్చింది. అంతలోనే రామ్ చరణ్ కు మళ్లీ గాయమైందంటూ కథనాలు. సినిమా షూటింగ్ మరోసారి నిలిచిపోయిందంటూ పుకార్లు.
ఈసారి మాత్రం యూనిట్ వెంటనే రియాక్ట్ అయింది. రామ్ చరణ్ కు ఎలాంటి గాయాలు తగల్లేదని వివరణ ఇచ్చింది. రామ్ చరణ్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని, నిన్న-మొన్న షూటింగ్ లో కూడా పాల్గొన్నాడని క్లారిటీ ఇచ్చింది. దీంతో చరణ్ గాయంపై వచ్చిన పుకార్లకు చెక్ పడింది.
రాజమౌళి దర్శకత్వంలో వస్తోంది ఆర్-ఆర్-ఆర్. స్వతంత్ర పోరాటానికి ముందు అల్లూరి సీతారామరాజు తన యంగేజ్ లో కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోతాడు. ఆ సమయంలో కొమరం భీమ్ కూడా కొన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోతాడు. చరిత్రలో వీళ్లిద్దరూ కలుసుకున్న దాఖలాలు లేవు. అలా చరిత్రలో కలుసుకోని ఈ ఇద్దరు స్వతంత్ర యోధులు, కలిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో వస్తోంది ఆర్-ఆర్-ఆర్.
సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. రామ్ చరణ్ సరసన అలియాభట్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఎన్టీఆర్ సరసన నటించనున్న ఫారిన్ హీరోయిన్ ను ఇంకా ఎంపిక చేయలేదు.