టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తపస్సుకు బీజేపీ కరిగిపోయింది. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షాలపై చంద్రబాబు ప్రదర్శిస్తున్న భక్తిప్రపత్తులకు బీజేపీ ఢిల్లీ నాయకత్వం మెచ్చింది. రాష్ట్రంలో అధికారం కోల్పోయి నప్పటి నుంచి చంద్రబాబునాయుడు తపస్సు చేస్తున్నారు. బాబు భీకర తపస్సుకు భూమి, ఆకాశాలు దద్దరిల్లుతున్నాయి.
ఈ విషయం తెలిసి నారద మహర్షి వారు తండ్రి కోరిక ఏమిటని బాబు తనయుడు లోకేశ్‌ను ప్రశ్నించగా…మోడీ, అమిత్‌షాలను ప్రసన్నం చేసుకోవాలని తపస్సుకు కూర్చున్నట్టు చెప్పారు. నారదుడు ఈ విషయాన్ని ఢిల్లీకి మోసుకెళ్లి మోడీ, అమిత్‌షాల చెవులల్లో వేశారు. దీంతో తమ కోసం నిద్రాహారాలు మాని తపస్సు చేస్తున్న మహా భక్తుడిని విస్మరించడం పద్ధతి కాదని భావించి చల్లని చూపు ప్రసరింపజేశారు.
ఈ నేపథ్యంలో బాబు పేరిట మానవ జాతి మనుగడ సాగించినంత కాలం గుర్తించుకునేలా ఓ దినాన్ని ఆయన పేరిట బీజేపీ సర్కార్ ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని బీజేపీ యువమోర్చాతో పాటు బీజేపీ జాతీయ కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్‌చార్జ్ సునీల్ దియోధర్ తమ ట్వీట్లలో వెల్లడించారు. ఆ ట్వీట్ల సారాంశం ఏంటంటే…
ఇక మీదట ప్రతి ఏడాది ఆగస్టు 25న బాబు జ్ఞాపకార్థం వెన్నుపోటు దినాన్ని జరుపుకోనున్నారు. దేశంలో నమ్మించి తడి గుడ్డలతో గొంతులు కోసిన వారిని గుర్తించి బాబు పేరిట అవార్డులను ప్రభుత్వమే ఇవ్వనుంది. కావాలంటే ఆ ట్వీట్లను చూడండి.
“టీడీపీ అధ్యక్ష పదవి, ముఖ్యమంత్రి స్థానం నుంచి ఎన్టీఆర్‌ను బలవంతంగా తప్పించిన ఘటన జరిగి మంగళవారానికి 25 ఏళ్లు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుకు వెన్నుపోటు శుభాకాంక్షలు” అని బీజేపీ యువమోర్చా రాష్ట్ర విభాగం ట్వీట్ చేసింది.
“చంద్రబాబుకు ఈ రోజు బాగా గుర్తు ఉంటుందని ఆశిస్తున్నా. తనకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును 25 ఏళ్ల క్రితం ఇదే రోజున ఎన్టీఆర్ పార్టీ నుంచి బహిష్కరించారు. చంద్రబాబు…బీజేపీని, ప్రధాని మోడీని కూడా మోసం చేశారు. అధికారాన్ని కోల్పోయిన బాబు త్వరలో రాజకీయాల నుంచి నిష్క్రమించబోతున్నారు. ఎవరు చేసుకున్న కర్మకు వాళ్లే బాధ్యులు అనడానికి చంద్రబాబే నిదర్శనంష అని సునీల్ దియోధర్ ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన 1995, ఆగస్టు 25న చంద్రబాబుతో సహా మరో నలుగురు నేతలను టీడీపీ నుంచి బహిష్కరిస్తూ అప్పటి అసెంబ్లీ స్పీకర్‌కు, ఎన్టీఆర్ రాసిన లేఖను జతచేస్తూ షేర్ చేశారు. దీన్నిబట్టి చంద్రబాబుపై బీజేపీ ఏ అభిప్రాయంతో ఉన్నదో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. బాబు తలకిందులు తపస్సు చేసినా….చివరికి ఇలాంటి సత్కారాలే అందుతాయి.