అతిలోక సుందరి శ్రీదేవి తన నటన, అందచందాలతో యావత్ భారతీయులను తన అభిమానులుగా చేసుకున్నారు. అందుకే ఆమె భౌతికంగా మనమధ్య లేకపోయినా ప్రతి భారతీయుడి మనో నేత్రం ముందు శ్రీదేవి సౌందర్యం కదలాడుతూ ఉంటుంది. కళాకారణిగా శ్రీదేవికి ఎప్పటికీ మరణం లేదు. కానీ ఆమె రక్తం పంచుకుని పుట్టిన కూతురు మాత్రం సినిమాలకు పనికి రాదనే విమర్శ ఎదుర్కోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఈ విషయాన్ని శ్రీదేవి పెద్ద కూతురు, ప్రముఖ బాలీవుడ్ యువ హీరోయిన్‌గా వెలుగొందుతున్న జాన్వీకపూర్ ఎంతో ఆవేదనతో చెప్పుకొచ్చారు. జాన్వీ హీరోయిన్‌గా నటించిన ‘గుంజన్ సక్సేనా’ చిత్రం ఇటీవలే ఓటీటీ వేదికలో విడుదలై విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కించుకుంది. ఈ సందర్భంగా జాన్వీ ఎంతో భావోద్వేగంగా మాట్లాడారు.
‘రెండేళ్ల క్రితం నా తొలి చిత్రం ‘ధడక్' విడుదలైంది. ఆ సినిమాలో నా నటన ఏ మాత్రం బాగోలేదని, హీరోయిన్‌గా అసలు పనికి రానని విమర్శలు చేశారు. అంతటితో విమర్శలు ఆగలేదు. మా అమ్మే బతికి ఉంటే నా నటన చూసి ఆవేదన చెందేవారని కొందరు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎవరెన్ని విమర్శలు చేసినా, నేను మానసికంగా కుంగిపోలేదు. నటనలో నా లోపాల్ని ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ నన్ను నేను తెరపై కొత్తగా ఆవిష్కరించుకుంటూ వస్తున్నాను’ అని చెప్పుకొచ్చారామె.
ప్రస్తుతం ‘గుంజన్ సక్సేనా’ చిత్ర సమీక్షల్లో తన నటన అద్భుతంగా ఉందని చాలా మంది మెచ్చుకున్నారని, అవి చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయినట్టు జాన్వీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంలో ప్రేక్షకుల ఆదరణ, అదే విధంగా విమర్శకుల ప్రశంసలు ఎంత ముఖ్యమైనవో మొట్టమొదటి సారిగా అనుభవంలోకి తెలిసొచ్చిందన్నారు. అమ్మబతికి ఉంటే ఈ సినిమా చూసి ఎంతో సంతోషపడేదని జాన్వీ ఆనందం వ్యక్తం చేశారు.