కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సినిమా షూటింగ్‌లన్నీ ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో ఆరు నెలలుగా థియేటర్లు, షూటింగ్‌లన్నీ బంద్ అయ్యాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం థియేటర్లు, షూటింగ్‌లకు సంబంధించి కొన్ని నిబంధనలు విధిస్తూ అనుమతులిచ్చింది. స్పాట్‌లో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ…షూటింగ్‌లు నిర్వహించుకోవచ్చని కేంద్రం గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది.
అలాగే థియేటర్స్‌లో సీటింగ్ విషయంలోనూ కొన్ని నిబంధనలు పెట్టింది. అయితే నిబంధనలు, జాగ్రత్తలు ఎన్ని తీసుకుంటున్నా…అంతిమంగా నటీనటులకు ధైర్యం చిక్కడం లేదు. ఎందుకంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదో రకంగా కరోనా వ్యాపిస్తూనే ఉంది. బుల్లి, వెండితెరలకు సంబంధించిన పలువురు నటీనటులు కరోనా బారిన పడి నానా యాతనలు పడ్డారు, పడుతున్నారు. ప్రసిద్ధ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం చెన్నై ఆస్పత్రిలో కరోనాతో భీకర పోరాటం సాగిస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కేంద్రం విధించిన నిబంధనలు, థియేటర్లు, సినిమా షూటింగ్‌లపై ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ పెదవి విరిచారు. నిబంధనలు ఏవైనప్పటికీ షూటింగ్‌లు చేయడం సాధ్యం కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గైడ్‌లైన్స్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు.
ఈ మహమ్మారికి వ్యాక్సిన్ వస్తేనే.. ధైర్యంగా నటీనటులు, సాంకేతిక నిపుణులు షూటింగ్స్‌కి వస్తారని ఆయన కుండబద్దలు కొట్టారు. అంత వరకూ ఎవరూ షూటింగ్‌ల్లో పాల్గొనే పరిస్థితే తలెత్తదని ఆయన తేల్చి చెప్పారు. మరోవైపు ప్రతిరోజూ చిత్రపరిశ్రమలో ఒకరిద్దరు కరోనా బారిన పడుతున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.