మన దేశంలో స్త్రీ, పురుషుల వివాహ వయసుకు సంబంధించి కొన్ని నిబంధనలున్నాయి. మహిళల వివాహ వయసు 18 ఏళ్లు, పురుషులకు 21 ఏళ్లు అని అందరికీ తెలిసిందే. అయితే మహిళల వివాహ వయసును పురుషులతో పాటు 21 ఏళ్లకు పెంచే ఆలోచనలో మోడీ సర్కార్ ఉంది. ఈ విషయమై ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రధాని మోడీ సూచన ప్రాయంగా ప్రకటించారు.
మహిళల వివాహ వయసును పెంచాలనే కేంద్ర ప్రభుత్వ ఆలోచనలపై పౌరసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మహిళల వివాహ వయసు ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచొద్దంటూ సుమారు వంద పౌరసంఘాలు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. వివాహ వయసు పెంచడం వల్ల కొత్తగా కలిగే ప్రయోజనాలేవీ ఉండవని పౌరసంఘాలు తమ అభిప్రాయాన్ని చెబుతున్నాయి. అంతేకాకుండా వయసు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం వల్ల బాల్య వివాహాలు ఆగిపోక పోవడంతో పాటు భారం పెరుగుతుందని పౌర సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
పురుషులతో పాటు మహిళల వివాహ వయసు 21 ఏళ్లకు పెంచడం వల్ల సమానత్వం రాదని, పైగా మహిళా సాధికారతకు ఆటంకం ఏర్పుడుతుందని చెబుతూ…వివాహ వయసు ఎందుకు పెంచకూడదో తమ అభ్యంతరాలను కేంద్రానికి పౌర సంఘాలు స్పష్టంగా చెప్పాయి.
అయితే మహిళల వివాహ వయసును పెంచకూడదని చెప్పడం వరకు బాగుంది. ఈ సందర్భంగా మరో విచిత్రమైన ప్రతిపాదన, డిమాండ్‌ను పౌర సంఘాలు తెరపైకి తెచ్చాయి. పురుషుల వివాహ వయసును కూడా 18 ఏళ్లకు తగ్గించేలా నిర్ణయం తీసుకోవాలనేది ఆ డిమాండ్ సారాంశం. ప్రపంచంలో చాలా దేశాల్లో పురుషుల వివాహ వయసు 18 ఏళ్లే అని పౌర సంఘాలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం గమనార్హం. మరి కేంద్రప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.