ఆంధ్రప్రదేశ్‌లో ఐదారు శాతానికి మించి ఓటు బ్యాంకు లేని బీజేపీ-జనసేన కూటమి గత కొంత కాలంగా చేస్తున్న హడావుడి చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. స్థానిక సంస్థలకు రీనోటిఫికేషన్ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేయడం, అక్కడ సానుకూల స్పందన రాకపోవడంతో ఏకంగా హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. తాజాగా ఆ కూటమి నేతలు మరో ముందడుగు వేశారు.
ఎన్నికల పవిత్రతను కాపాడ్డానికి తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేసి పరిషత్ ఎన్నికల ఫలితాల అనంతరం తాజా నోటిఫికేషన్ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ-జనసేన ప్రతినిధులు విజ్ఞప్తి చేయడం విమర్శలకు తావిస్తోంది.
ఈ కూటమి చేష్టలను చూస్తే… జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేసి, 2019 సార్వత్రికలకు కూడా తిరిగి రీనోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేసేలా ఉన్నారే అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఒక శాతం లోపు, అలాగే జనసేనకు ఐదు శాతం ఓట్లు మాత్రమే వచ్చిన సంగతి తెలిసిందే.
కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా నేతృత్వంలోని ఈసీ బృందాన్ని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ నేతృత్వంలో జీవీఎల్ నరసింహారావు, సుజనాచౌదరి, సీఎం రమేశ్, సునీల్ దేవ్‌ధర్, నాదెండ్ల మనోహర్ నిన్న రాత్రి వినతిపత్రం అందజేయడం గమనార్హం.
ఉప ఎన్నిక ప్రచార సమయంలో స్థానిక సంస్థల ఫలితాలను ఏప్రిల్ 10న ప్రకటించి అధికార పార్టీకి ప్రయోజనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు ఉద్దేశ పూర్వకంగా ప్రాదేశిక ఎన్నికలకు సిఫార్సు చేశారని ఫిర్యాదు చేయడం ద్వారా బీజేపీ- జనసేన కూటమి ఆవేదన ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీ విజయ పతాకాన్ని ఎగుర వేస్తుందని ఆ కూటమి చెప్పకనే చెప్పింది. ఓటమి భయంతో ఏకంగా తిరుపతి ఉప ఎన్నికనే రద్దు చేసి, రీనోటిఫికేషన్ ఇవ్వాలనే డిమాండ్ చేసే స్థాయికి బీజేపీ -జనసేన కూటమి దిగజారిందని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. పైగా ప్రధాన పార్టీలకు లేని ఇబ్బందులు ఈ కూటమికేంటో అర్థం కావడం లేదనే నిట్టూర్పులు వ్యక్తమవుతున్నాయి.