ఎట్టకేలకు జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీ బీజేపీ స్వాగతించింది. టీడీపీకి ఏ మాత్రం తగ్గకుండా ఏపీ సర్కార్‌పై బీజేపీ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అసలు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఉండడమే పెద్ద నేరంగా బీజేపీ భావిస్తున్నట్టు… ఆ పార్టీ నేతల విమర్శలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 26 జిల్లాలను ఏర్పాటు చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటన కూడా జారీ చేసింది. ఒక్కో పార్లమెంట్ కేంద్రాన్ని జిల్లాగా మారుస్తూ పాలనలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు ఏపీ సర్కార్ ముందడుగు వేసింది.
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నట్టు ఏపీ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అన్నారు. బీజేపీ కార్యాలయంలో 73వ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఏపీలో 26 జిల్లాల ఏర్పాటు విషయమై తమ ఎన్నికల ప్రణాళికలో కూడా పొందుపరిచామన్నారు.
అదే పని జగన్ ప్రభుత్వం చేయడంతో స్వాగతిస్తున్నామన్నారు. అయితే ఇంకా కొంత చర్చ జరగాల్సి వుందన్నారు. జిల్లా సరిహద్దుల విషయంలో కొన్ని చోట్ల అభ్యంతరాలు ఉన్నట్టు ఆయన చెప్పుకొచ్చారు.