తెలంగాణ‌లో బీజేపీ సంచ‌ల‌నం!

గెలుపు టీఆర్ఎస్ దే అయినా.. బీజేపీ గ‌ట్టి పోటీ ఇచ్చింది, టీఆర్ఎస్ కు ల‌క్ష మెజారిటీ వ‌చ్చినా ఈ బైపోల్ లో బీజేపీ గ‌ట్టిగా పోరాడింది.. ఇవీ కౌంటింగ్ ముందు వ‌ర‌కూ వినిపించిన విశ్లేష‌ణ‌లు.…

గెలుపు టీఆర్ఎస్ దే అయినా.. బీజేపీ గ‌ట్టి పోటీ ఇచ్చింది, టీఆర్ఎస్ కు ల‌క్ష మెజారిటీ వ‌చ్చినా ఈ బైపోల్ లో బీజేపీ గ‌ట్టిగా పోరాడింది.. ఇవీ కౌంటింగ్ ముందు వ‌ర‌కూ వినిపించిన విశ్లేష‌ణ‌లు. దుబ్బాక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి అనూహ్యంగా ఉప ఎన్నిక వ‌చ్చింది. అంతే వేగంగా దానికి షెడ్యూల్ వ‌చ్చింది.

ఏదో త‌ప్ప‌ద‌న్న‌ట్టుగా పోటీ చేయాల‌న్న‌ట్టుగా కాంగ్రెస్, బీజేపీలు నామినేష‌న్లు వేసిన‌ట్టుగా క‌నిపించాయి. ఇది వ‌ర‌కూ ఉప ఎన్నిక‌లు జ‌రిగిన సంద‌ర్భాల్లో టీఆర్ఎస్ హ‌వా గురించి అంద‌రికీ తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈ ఉప ఎన్నిక‌, సానుభూతి వంటి వాటిని గ‌మ‌నించుకుంటే.. టీఆర్ఎస్ మెజారిటీ ల‌క్ష దాటుతుందేమో అనే అభిప్రాయాలే వినిపించాయి.

అందుకు ప్రధాన కార‌ణాల్లో ఒక‌టి సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈ సీట్లో టీఆర్ఎస్ సాధించిన విజ‌యం. అప్పుడు కాంగ్రెస్, బీజేపీలు చెరో ఇర‌వై వేల ఓట్ల స్థాయిలో నిలిచాయి. బీజేపీ మూడో స్థానంలో నిలిచింది. అప్పుడు కూడా ఇదే ర‌ఘునంద‌న‌రావు బీజేపీ త‌ర‌ఫున పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. ఉప ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దిగి ఆయ‌న దుబ్బాక నుంచి మూడో సారి పోటీ చేసిన‌ట్టుగా అయ్యింది.

ప్ర‌చార ద‌శ‌లో దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గంలో ర‌చ్చ‌ర‌చ్చ జ‌రిగింది. బీజేపీ అభ్య‌ర్థి బంధుగ‌ణం వ‌ద్ద భారీగా డ‌బ్బు ప‌ట్టుబ‌డిన‌ట్టుగా కేసులు న‌మోద‌య్యాయి. అయితే పోలీసులే ఆ డ‌బ్బును పెట్టి ప‌ట్టుకున్నార‌ని బీజేపీ అభ్య‌ర్థి ఆరోపించారు. ఇలా ర‌చ్చ ర‌చ్చ జ‌రిగింది. దుబ్బాక‌లో పార్టీ గెలుపును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని ప‌ని చేశారు హ‌రీష్ రావు. అయితే ప్ర‌యోజ‌నం ద‌క్కిన‌ట్టుగా లేదు.

ల‌క్ష మెజారిటీ సంగెతెలా ఉన్నా‌.. ల‌క్ష ఓట్ల‌ను కూడా సాధించ‌లేక‌పోయింది టీఆర్ఎస్. రౌండ్ రౌండ్ కూ నరాలు తెగే ఉత్కంఠ‌తో జ‌రిగిన కౌంటింగ్ లో బీజేపీ విజ‌యం సాధించింది.1470 ఓట్ల తేడాతో బీజేపీ అభ్య‌ర్థి ర‌ఘునంద‌న‌రావు దుబ్బాక‌లో జ‌య‌కేత‌నం ఎగ‌రేశారు. టీఆర్ఎస్ కు ఇది షాకింగ్ రిజ‌ల్ట్ అని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. 

కాంగ్రెస్ పార్టీ మాత్రం కోలుకోలేదు. 21 వేల ఓట్ల‌తో త‌మ ప‌రిస్థితి మెరుగ‌వ్వ‌లేద‌ని కాంగ్రెస్ స్ప‌ష్ట‌త‌ను ఇచ్చింది. అయితే కాంగ్రెస్ వాళ్లు  ఎలాగూ తాము గెల‌వ‌లేమ‌నే లెక్క‌ల‌తో బీజేపీకి అనుకూలంగా ప‌ని చేశార‌నే వాద‌న వినిపిస్తూ ఉంది. ఈ వాద‌న‌లెన్ని ఉన్నా.. ఈ విజ‌యంతో బీజేపీకి వంద ఏనుగుల బ‌లం వ‌చ్చిన‌ట్ట‌వుతోంది.

ట్రంపుకి చంద్రబాబు జూమ్ పాఠాలు!