యూపీ సీఎంకు బీజేపీ మ‌హిళా అగ్ర‌నేత చీవాట్లు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్‌కు సొంత పార్టీ మ‌హిళా అగ్ర‌నేత ఉమాభార‌తి చీవాట్లు పెట్టారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ద‌ళి తుల‌పై వ‌రుస అఘాయిత్యాలు బీజేపీకి దేశ వ్యాప్తంగా బాగా డ్యామేజీ అవుతోంది. త‌ప్పుల‌ను స‌రిదిద్దుకోవ‌డానికి బ‌దులు…

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్‌కు సొంత పార్టీ మ‌హిళా అగ్ర‌నేత ఉమాభార‌తి చీవాట్లు పెట్టారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ద‌ళి తుల‌పై వ‌రుస అఘాయిత్యాలు బీజేపీకి దేశ వ్యాప్తంగా బాగా డ్యామేజీ అవుతోంది. త‌ప్పుల‌ను స‌రిదిద్దుకోవ‌డానికి బ‌దులు మ‌రిన్ని త‌ప్పులు చేస్తుండ‌డంతో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి, కేంద్రంలోని మోడీ స‌ర్కార్‌కు కూడా త‌ల‌వంపులు తెస్తోంది. 

ఉత్త‌ర‌ప్ర దేశ్‌లోని హాథ్ర‌స్‌లో  19 ఏళ్ల ద‌ళిత యువ‌తిపై అత్యాచారం, అనంత‌రం హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. నిందితుల‌ను ప‌ట్టుకుని క‌ఠిన శిక్షించాల‌ని పోలీసులు ఆ ప‌ని చేయ‌క‌పోగా, బాధిత యువ‌తి మృత‌దేహాన్ని అర్ధ‌రాత్రి ద‌హ‌నం చేయ‌డం మ‌రింత వివాదానికి దారి తీసింది.

ఈ ఘ‌ట‌న‌పై దేశ వ్యాప్తంగా నిర‌స‌న‌లు ఎగిసిప‌డుతున్నాయి. పైపెచ్చు బాధితుల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి వెళుతున్న కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు రాహుల్‌గాంధీ, ఆయ‌న సోద‌రి ప్రియాంక గాంధీల‌ను పోలీసులు అడ్డుకుని అమానుషంగా ప్ర‌వ‌ర్తించారు. రాహుల్‌ను కింద‌ప‌డేయ‌డంతో ప్ర‌తిప‌క్షాలు భ‌గ్గుమ‌న్నాయి.

ఈ నేప‌థ్యంలో యోగి స‌ర్కార్‌పై బీజేపీ మ‌హిళా అగ్ర‌నేత, మాజీ కేంద్ర మంత్రి ఉమాభార‌తి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు ఆమె ట్వీట్ చేశారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఘ‌ట‌న , పోలీసుల తీరు సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌తో పాటు బీజేపీకి మ‌చ్చ తెచ్చింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ స‌ర్కార్‌కు ఆమె కొన్ని సూచ‌న‌లు, స‌ల‌హాలిచ్చారు. 

‘ఓ దళిత బిడ్డ ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత  ఆమె అంతిమ సంస్కారాలను పోలీసులు హ‌డావుడిగా ముగించారు.  ఇప్పుడు ఆమె కుటుంబాన్ని, గ్రామాన్నీ ఎవరితో కలవనీయకుండా ఆంక్ష‌లు విధించారు. హాథ్రస్‌ ఘటనకు బాధ్యులపై మీరు తప్పకుండా చర్యలు తీసుకుంటారని భావించి  నేను ఏమీ మాట్లాడొద్దని అనుకున్నా. కానీ బాధితుల పట్ల పోలీసులు ప్రవ ర్తిస్తున్న తీరు అత్యంత అమాన‌వీయంగా ఉంది. 

పోలీసుల తీరు ఎంతో బాధ‌, ఆవేద‌న క‌లిగిస్తోంది. సిట్‌ దర్యాప్తు జరుగుతున్న‌ప్పుడు బాధిత కుటుంబం ఎవరితో కలవకూడదనే నిబంధన ఉందా? ఇలాంటి ఘటనలతో సిట్‌ దర్యాప్తుపై కూడా అనుమనాలు క‌లుగుతాయి. 

రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మనం(భాజపా ప్రభుత్వం) దేశమంతా రామరాజ్యం తీసుకొస్తామని హామీ ఇచ్చాం. కానీ ఇప్పుడు హాథ్రస్‌లో పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు.. అటు యూపీ ప్రభుత్వంతో పాటు బీజేపీకి కూడా మచ్చ తెస్తోంది’ అని ఉమాభార‌తి వరుస ట్వీట్లలో ఆగ్ర‌హం, ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఉమాభార‌తి ఆవేద‌న చూస్తుంటే ఆమెలో మొద‌ట ఓ మాతృమూర్తి, ఓ మ‌హిళగా ఆందోళ‌న క‌నిపిస్తోంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌తిప‌క్షాల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర‌వుతున్న ప‌రిస్థితిలో సొంత పార్టీకి చెందిన అగ్ర‌నేత నుంచి ఇలాంటి ట్వీట్లు రావ‌డంతో ఆదిత్య‌నాథ్ స‌ర్కార్‌ను మ‌రింత ఇర‌కాటంలో ప‌డేసిన‌ట్టైంది. ఇప్ప‌టికైనా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ స‌ర్కార్ త‌న త‌ప్పిదాన్ని స‌రిదిద్దుకునేందుకు స‌త్వ‌ర చ‌ర్య‌లు చేప‌ట్టాల్సిన అవ‌స‌రం ఉంది. 

నాకు డ‌బ్బులు చాలా అవ‌స‌రం

జగన్ సుదర్శన చక్రం ఎప్పుడు ప్రయోగిస్తారో