కరోనా వైరస్ కి తోడు అన్నట్లుగా బ్లాక్ ఫంగస్ కూడా రోగులను వెంటాడుతోంది. ఇది దేశంలో ఎక్కడో ఉందని అంతా అనుకునే లోపే విశాఖలో కూడా తన ఉనికి చాటుకుంటోంది విశాఖ నగరంలోని మధురవాడకు చెందిన ఒక ముప్పయి అయిదేళ్ళ మహిళ బ్లాక్ ఫంగస్ లక్షణాలతో కేజీహెచ్ కి రావడంతో డాక్టర్లు అది ఆ వ్యాధే అని నిర్దారించారు.
ఇదిలా ఉంటే విశాఖలో బ్లాక్ ఫంగస్ తొలి కేసుగా దీన్ని భావిస్తున్నారు. కరోనా వైరస్ నయం కావడానికి వాడే అతి మోతాదు మందుల పర్యవశానంగానే బ్లాక్ ఫంగస్ వస్తోందని వైధ్య రంగ నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా బ్లాక్ ఫంగస్ తొలి కేసు వెలుగు చూడడంతో విశాఖ నగరం వణుకుతోంది.
ఇప్పటికే ఏపీలోని కరోనా కేసులలో టాప్ ఫైవ్ జిల్లాలలో విశాఖ ఒకటిగా ఉంది. తాజా పరిణామాల నేపధ్యంలో మరి ఎంతమందికి బ్లాక్ ఫంగస్ వ్యాధి లక్షణాలు ఉన్నాయన్న దాని మీద వైద్య నిపుణులు ఆరా తీస్తున్నారు.
దీనికి ముందు శ్రీకాకుళం జిల్లాలో కూడా బ్లాక్ ఫంగస్ కేసు ఒకటి బయటపడినట్లుగా చెబుతున్నారు. మొత్తానికి పులి మీద పుట్ర అన్నట్లుగా ఈ కొత్త వ్యాధి ఏంటని విశాఖ జనాలు హడలుతున్నారు.