వారు ప్రాణం పోసే దాతలు. వైద్య రంగంలో అపారమైన అనుభవం ఉన్న డాక్టర్లు. కరోనా వేళ ఎందరికో ఊపిరూదారు. కరోనా రోగులకు కొత్త జీవితాలను అందించిన అపర దేవుళ్ళు. కరోనా మీద పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్. అటువంటి వారి మీద కరోనా రక్కసి ఒక్కసారిగా విరుచుకుపడింది. ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురి వైద్య నిపుణులును ఒకే రోజు కాటేసి తన రాక్షసత్వాన్ని చాటుకుంది.
విశాఖ కేజీహెచ్ లో పిల్లల వైద్య విభాగం అధిపతిగా ఎంతో సేవ చేసి మన్ననలు అందుకున డాక్టర్ వేణుగోపాల్, అలాగే ఎనస్తీషియా డాక్టర్ వరప్రసాద్, జనరల్ మెడిసిన్ విభాగం డాక్టర్ సత్యనారాయణరాజు కరోనా కాటుకు ఈ లోకాన్ని వీడారు.
సెకండ్ వేవ్ వీర విహారం చేస్తున్న వేళ విశాఖ విమ్స్ లో వీరు రోగులను కాపాడడానికి అహరహం శ్రమిస్తూ ఆఖరుకు తన తనువులు సైతం అర్పించారు. పీపీఐ కిట్లతో రోజుల తరబడి రోగుల వెంట ఉంటూ కరోనా మహమ్మారి తో యుద్ధమే చేశారు. అందులో ఎంతో మందిని రక్షించి విజేతలుగా నిలిచినా తమ వృత్తి ధర్మానికి కట్టుబడి అలుపెరగని పొరాటంలో అసువులు బాయడం అత్యంత బాధాకరం.
వీరిలో డాక్టర్ వేణుగోపాల్ విశాఖ రెడ్ క్రాస్ యూనిట్ చైర్మన్ గా కూడా విశేష సేవలు అందించారు. కాగా వేణు గోపాల్ మృతిని గవర్నర్ విశ్వభూటన్ హరిచందన్ సంతాపం తెలియచేశారు. డాక్టర్ల మరణం తీరని లోటు అని పలువురు ప్రజా ప్రధినిదులు, రాజకీయ, వైద్య నిపుణులు ఆవేదన వ్యక్తం చేశారు.