మొన్నటివరకు మహారాష్ట్రకే పరిమితమైందనుకున్న బ్లాక్ ఫంగస్ కేసులు ఆంధ్రప్రదేశ్ లో కూడా వెలుగుచూస్తున్నాయి. తాజాగా విశాఖపట్నంలో ఓ మహిళ బ్లాక్ ఫంగస్ బారిన పడి మృతి చెందింది కూడా.
ముందుగా కంటిచూపు పోయింది. తర్వాత ఫంగస్ మెదడుకు సోకింది. పరిస్థితి విషమించి ఆమె మరణించింది. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఇప్పుడీ తరహా కేసులు బయటపడుతున్నాయి. ప్రాణాంతకంగా మారుతున్న బ్లాక్ ఫంగస్ ను ఎలా గుర్తించాలి?
అసలు బ్లాక్ ఫంగస్ ఎందుకొస్తుంది?
కరోనా నుంచి కోలుకున్న ప్రతి ఒక్కరికి బ్లాక్ ఫంగస్ సోకుతుందనే భ్రమ చాలామందిలో ఉంది. అది కేవలం అపోహ మాత్రమే. కరోనా ట్రీట్ మెంట్ లో భాగంగా అతిగా స్టెరాయిడ్స్ వాడిన పేషెంట్లలో బ్లాక్ ఫంగస్ ఎక్కువగా కనిపిస్తుంది. దీనికితోడు సదరు కరోనా రోగికి మధుమేహం ఉంటే బ్లాక్ ఫంగస్ సోకే ప్రమాదం మరింత ఎక్కువ.
కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ తో పాటు ఇతర ట్రీట్ మెంట్స్ కోసం ఇమ్యూనిటీ కంట్రోల్ డ్రగ్స్ వాడే వాళ్లలో బ్లాక్ ఫంగస్ ఎక్కువగా కనిపిస్తుంది. అప్పటికే అనారోగ్య సమస్యలతో ఉండి, కరోనా ట్రీట్ మెంట్ లో భాగంగా స్టెరాయిడ్స్ వాడిన వాళ్లు బ్లాక్ ఫంగస్ బారిన పడతారు.
బ్లాక్ ఫంగస్ లక్షణాలు
కరోనా నుంచి కోలుకున్న తర్వాత చాలామందిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ముక్కు, నోరు, కళ్లు, మెదడు ఈ ఫంగస్ కు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. బ్లాక్ ఫంగస్ తొలి దశలో ముక్కు దిబ్బడ ఉంటుంది. ముక్కు కారడం, ముక్క చీముడి గోధుమ-నలుపు రంగులో ఉండడం ప్రధాన లక్షణం. దీంతో పాటు ముక్కు నల్లగా మారిపోతుంది.
ఇక బ్లాక్ ఫంగస్ సోకిన వ్యక్తుల్లో 50శాతం మందికి కంటికి సంబంధించిన లక్షణాలే కనిపిస్తున్నాయి. కంటి చూపు మందగించడం, కంటి చుట్టూ చర్మం ఎర్రబడడం, కంటి వెనక నొప్పి లాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ లక్షణాలు కొందరిలో 2-3 రోజుల్లోనే ముదిరి, కళ్లు పోగొట్టుకునే ప్రమాదం ఉంది. వీటితో పాటు బుగ్గలు నొప్పిపెట్టడం, దంతాలు కదలడం, నోరు పైభాగం (అంగిలి) నల్లగా మారడం కూడా బ్లాక్ ఫంగస్ లక్షణాలే.
ముందు జాగ్రత్తలు
కరోనాతో బాధపడేవారు ట్రీట్ మెంట్ టైమ్ లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గతంలో ఏమైనా సర్జరీలు జరిగినా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నా ఆ విషయాన్ని వైద్యులకు ముందుగానే చెప్పాలి. మరీ ముఖ్యంగా హార్ట్ ఆపరేషన్ అయిన వాళ్లు, షుగర్ పేషెంట్లు, కాళ్లు-చేతులకు సర్జరీ జరిగి శరీరంలో స్టీల్ ప్లేట్స్ వేయించుకున్న వాళ్లు తప్పనిసరిగా ఈ విషయాల్ని వైద్యులకు చెప్పాలి.
ఇక ట్రీట్ మెంట్ సమయంలో, కరోనా చికిత్స ముగిసిన తర్వాత షుగర్ ను అదుపులో ఉంచుకోవాలి. స్టెరాయిడ్స్ ను తక్కువ మోతాదులో వాడాలి. కరోనా ట్రీట్ మెంట్ లో భాగంగా ఆక్సిజన్ తీసుకోవాల్సి వస్తే, స్టెరిల్ వాటర్ నే వాడాలి. 2 వారాల కంటే ఎక్కువ వెంటిలేటర్ మీద ఉన్న వాళ్లు, ఈ క్రమంలో ఆక్సిజన్, స్టెరాయిడ్స్ తీసుకున్న వాళ్లు, షుగర్ అదుపులో లేని వాళ్లు ముందుజాగ్రత్తగా వైద్యుల పర్యవేక్షణలో పాసకొనాజల్ టాబ్లెట్స్ వేసుకుంటే ఇన్ఫెక్షన్లను అడ్డుకోవచ్చు.
చికిత్స ఎలా?
దురదృష్టవశాత్తూ బ్లాక్ ఫంగస్ బారిన పడితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీన్ని సకాలంలో గుర్తించడమే మనం చేయాల్సిన పని. అలా సకాలంలో గుర్తిస్తే ట్రీట్ మెంట్ వల్ల ఉపయోగం ఉంటుంది. ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ ద్వారా ముక్కులో, గాలిగదుల్లో, నోటి లోపల నల్లబడిన చర్మాన్ని, చీమును తొలిగిస్తారు.
మరీ తీవ్రత ఎక్కువగా ఉంటే 2-3 వారాల తర్వాత ఇదే ప్రక్రియను రిపీట్ చేస్తారు. ఆపరేషన్ తర్వాత కూడా మందులు వాడాల్సి ఉంటుంది. లేదంటే వైరస్ తిరిగి విజృంభించే ప్రమాదం ఉంది. ఇక కంటికి బ్లాక్ ఫంగస్ పూర్తిస్థాయిలో విస్తరిస్తే మాత్రం కొందరిలో కన్ను తొలిగించాల్సి ఉంటుంది. లేదంటే ఫంగస్ మెదడుకు చేరే ప్రమాదం ఉంటుంది.