నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కేసులో అసలు విషయం పక్కకు పోయి కొసరు ప్రాధాన్యం సంతరించుకుంది. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నివేదికను తెలంగాణ హైకోర్టు సీల్డ్ కవర్‌లో సుప్రీం కోర్టుకు పంపింది. ఈ సీల్డ్ కవర్‌లో పంపిన నివేదికలో ఏముందనే విషయమై పాలక ప్రతిపక్ష పార్టీల్లో టెన్షన్ నెలకుంది.
తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రకు పాల్పడ్డారనే అభియోగాలపై రఘురామకృష్ణంరాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను గుంటూరుకు తరలించారు. ఆ మరుసటి రోజు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని హైకోర్టు కొట్టి వేస్తూ, కింది కోర్టుకు వెళ్లాలని సూచించింది. ఆ తర్వాత అసలు డ్రామా మొదలైంది.
అంత వరకూ కేవలం బెయిల్‌కు సంబంధించిన విషయాలే మాట్లాడుతున్న వాళ్లు, ఆ తర్వాత రఘురామను కొట్టారంటూ కొత్త వాదన తెరపైకి తెచ్చారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే కొట్టిన గాయాలు కావని, అలాగే ఎంపీ ఒంటిపై కూడా ఎలాంటి దెబ్బలు లేవని నివేదికను సమర్పించారు. దీనిపై మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లారు.
రఘురామకృష్ణంరాజుకు సికింద్రా బాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి నివేదికను సీల్డ్ కవర్‌లో అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో నిన్న రఘురామకృష్ణంరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించి, నివేదికను సర్వోన్నత న్యాయస్థానానికి పంపారు.
అయితే ఈ నివేదిక ఏం తేల్చనుందనే విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది. ఒకవైపు ప్రభుత్వం మాత్రం రఘురామకృష్ణం రాజుపై ఎలాంటి దాడి చేయలేదని, ఇదంతా బెయిల్ కోసం అడుతున్న డ్రామాగా కొట్టి పడేస్తున్నారు. మరోవైపు రఘురామ కృష్ణంరాజుకు మద్దతుగా నిలిచిన వాళ్లు మాత్రం ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని గట్టిగా నమ్మతున్నారు.
ఈ రెండు వాదనల మధ్య …అసలు వాస్తవాలేంటో ఆర్మీ ఆస్పత్రి నివేదిక తేల్చనుంది. ఒకవేళ కొట్టలేదనే తేలితే ప్రభుత్వానికి ఊరట లభించినట్టే. అప్పుడు కోర్టులను, వ్యవస్థను తప్పుదోవ పట్టించిన నేరం కింద శిక్ష ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అలాగే కొట్టిన గాయాలని తేలితే, దానికి ఏపీ సీఐడీపై ఎలాంటి చర్యలుంటాయనే దానిపై కూడా విస్తృత చర్చ జరుగుతోంది. ఏపీ సీఐడీలో ముఖ్యమైన అధికారులతో పాటు కింది స్థాయి సిబ్బందిపై కఠిన చర్యలుంటాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రెండుమూడు రోజుల్లో సీల్డ్ కవర్ నివేదికలోని అంశాలు వెల్లడి కానున్నాయి. అంత వరకూ ఏపీలో సీల్డ్ కవర్ టెన్షన్ కొనసా గుతూనే ఉంటుంది.