అధికారుల నిర్లక్ష్యాన్ని భరించలేని చిత్తూరు కలెక్టర్ హరినారాయణన్ కీలక, కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఐదు మండలాల్లోని ఉద్యోగుల జీతాలు నిలుపుదల చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇవ్వడం సంచలనం రేకెత్తిస్తోంది. కోవిడ్‌ను కట్టడి చేసే క్రమంలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆరో విడత ఫీవర్ సర్వే చేపట్టింది.
ఈ సర్వే కింద గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రతి కుటుంబ సభ్యులు ఆరోగ్య వివరాలు నమోదు చేయాల్సి ఉంది. అయితే చిత్తూరు జిల్లాలోని పెద్దమండ్యం, తవణంపల్లె, శ్రీకాళహస్తి, సత్యవేడు, మదనపల్లె మండలాల్లోని రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆరోగ్య, సచివాలయం, మున్సిపల్‌శాఖ ఉద్యోగులు అలసత్వం వహించారని కలెక్టర్ సీరియస్ అయ్యారు.
ఆ ఐదు మండలాల నుంచి సరైన వివరాలను సేకరించకపోవడంతో అప్రమత్తత చర్యలు తీసుకోలేని పరిస్థితి నెలకుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి బాధ్యత చేస్తూ ఆ ఐదు మండలాల్లోని ఉద్యోగుల నెల జీతాలను నిలిపివేస్తున్నట్టు కలెక్టర్ వెల్లడించారు.
విపత్తు నిర్వహణ చట్టం కింద జీతాలు నిలుపుదల చేస్తూ ట్రెజరీని ఆదేశించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసే వారెవరైనా ఇదే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించడం గమనార్హం.