బద్దశత్రువుగా భావించే సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ అధికార పార్టీ వైసీపీకి ఒక్క సారిగా తెగ నచ్చేశారు. నిన్న ఒక ప్రముఖ చానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో లక్ష్మినారాయణ చెప్పిన మాటల్లో …ప్రతిపక్షానికి దిమ్మ తిరిగే వాస్తవాలు ఉండడంతో, ఆయన్ను నెత్తికెత్తుకుంది. గత కొంత కాలంగా పార్టీకి, ప్రభుత్వానికి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మింగుడు పడని విషయం తెలిసిందే.
ఇటీవల ఆయన్ను హైదరాబాద్‌లో ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. రఘురామకృష్ణంరాజు అరెస్ట్ రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. లోక్‌సభ స్పీకర్ అనుమతి లేకుండా రఘురామను అరెస్ట్ చేశారని, ఇది చాలా తీవ్రమని నేరమంటూ ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటు ఆ పార్టీ అనుకూల మీడియా గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. అలాగే ఎంపీలకు ప్రత్యేక ప్రివిలేజస్ ఉంటాయని, అవేవీ ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శల వర్షం కురిపిస్తున్నాయి.
ఇలాంటి కీలక తరుణంలో జగన్‌ను అరెస్ట్ చేసిన కేసులో కీలక అధికారిగా విధులు నిర్వర్తించిన సీబీఐ మాజీ అధికారి లక్ష్మినారా యణ చెప్పిన అంశాల్లో చాలా ప్రశ్నలకు సమాధానాలు లభించాయి. అలాగే వైసీపీకి కొత్త ఊపు తీసుకురాగా, టీడీపీకి, ఆ పార్టీ అనుకూల మీడియా నోళ్లు మూయించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ సదరు చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన అంశాలకు సంబంధించి వైసీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున వైరల్ చేస్తుండడం విశేషం. ఆ చానల్‌లో కీలక అంశాలపై చర్చ ఎలా సాగిందో తెలుసుకుందాం.
ప్రజెంటర్ రజనీకాంత్ః ఇటీవల ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాద్ వచ్చి ఎంపీ రఘురామకృష్ణంరాజును అరెస్ట్ చేసుకుని తీసుకెళ్లారు. ఎంత టైమ్ ముందు స్పీకర్‌కు సమాచారం అందించాలి? ఒక రోజు ముందు సమాచారం అందించాలా? అరెస్ట్ చేసిన తర్వాత తెలియజేయాలా?
లక్ష్మినారాయణః అరెస్ట్ చేసిన తర్వాత సమాచారం అందించాలి. అంతే తప్ప అరెస్ట్ చేసేందుకు స్పీకర్ అనుమతి అవసరం లేదు. ఒకవేళ పార్లమెంట్ సెషన్ జరుగుతుంటే మాత్రం స్పీకర్ పర్మీషన్ తీసుకుని అరెస్ట్ చేయాలి.
రజనీకాంత్ః ఎందుకు అరెస్ట్ చేశామో జస్టిపై చేస్తూ స్పీకర్‌కు చెప్పాల్సిన అవసరం లేదా?.
లక్ష్మినారాయణః అవసరం లేదు. కోర్టుకు చెప్పాలి. తాము ఎందుకు అరెస్ట్ చేస్తున్నామనే రీజనింగ్ కోర్టుకు తెలియజేయాలి. ఈ కేసులన్నీ కూడా కోర్టుతో లింక్ అయి ఉంటాయి. ఎందుకంటే వాళ్లు ఎంపీలో, ఎమ్మెల్యేలో కాబట్టి, వాళ్లకున్న ప్రివిలేజస్‌కు అనుగుణంగా ఇన్‌ఫరమేషన్ ఇవ్వడం అవసరం. దర్యాప్తు సంస్థలు కోర్టుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. మరెవరికీ సమాధా నం చెప్పుకోవాల్సి అవసరం లేదు.
రజనీకాంత్ః ఎంపీని ఫలాన ప్రత్యేక పరిస్థితుల్లో ఇన్వాల్స్ చేయొద్దు. లేదా ఎంపీ కాబట్టి ఆయన్ను ప్రత్యేకంగా ట్రీట్ చేయాలి. ఎంపీ కాబట్టి ప్రత్యేకంగా కేసులు ఫైల్ చేసుకోడానికి ప్రివిలేజ్ ఉందా? శని, ఆదివారాల్లో కూడా కోర్టులు పనిచేయాల్సిన అవసరం ఉంటుందా? లేదు బెయిల్‌కు అప్లై చేసుకోడానికి అందరికీ ఉన్నట్టే ఆయనకు కూడా ఉంటుందా? ప‌్రత్యేక హక్కు ఏమైనా ఉంటుందా?
లక్ష్మినారాయణః రూల్ ఆఫ్ లా అన్నది ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. చట్టం అందరికీ ఒకేలా వర్తిస్తుంది. సామాన్యులకు ఏ చట్టమైతే వర్తిస్తుందో, ఎమ్మెల్యే, ఎంపీలకు కూడా అదే చట్టం వర్తిస్తుంది. కానీ వాళ్లు ఆ పొజీషన్‌లో ఉన్నారు కాబట్టి, అరెస్ట్ అయిన తర్వాత సమాచారం అందించడం అనేది ముఖ్యమైంది. అది కాకుండా ఇతర విషయాల్లో సామాన్యుల విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తారో వీరి కేసులో కూడా అంతే.
రజనీకాంత్ః ఇప్పుడు రాష్ట్రపతికి, కేంద్ర హోమంత్రికి, హోంశాఖ కార్యదర్శికి , గవర్నర్‌కు కొంత మంది ఎంపీ భద్రతకు సంబంధించి అనుమానాలతో లేఖలు రాస్తున్నారు. ఆ లేఖల వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఆ లేఖల వల్ల ప్రత్యేక ప్రివిలేజ్ ఎంపీకి వచ్చే అవకాశం ఉందా?
లక్ష్మినారాయణః అలాంటివేవీ ఉండవు. చట్టం ముందు అందరూ సమానులే. ఇది చాలా క్లియర్.
రజనీకాంత్ః మరి అలా అంటే, రఘురామకృష్ణంరాజుకి గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రి నుంచి హైదరాబాద్ ఆర్మీ ఆస్పత్రికి ఎలా ప్రివిలేజ్ దొరికిందని అనుమానించే వాళ్లు కూడా ఉన్నారు. ఇది ఎలా?
లక్ష్మినారాయణః అది సుప్రీంకోర్టు ఆర్డర్.
రజనీకాంత్ః ఉదాహరణకు రఘురామకృష్ణంరాజు తనకు ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ కావాలని అడిగారు. దాన్ని ప్రభుత్వ న్యాయవాది తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకించడంలో అర్థం ఉందా? తనకు ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రివిలేజ్ కావాలని డిమాండ్ చేయడంలో సహేతుకత ఉందా?
లక్ష్మినారాయణః రెండు వైపుల నుంచి తమ డిమాండ్లను కోర్టు ముందు ఉంచుతారు. నేను ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాలని ఈయన అంటారు. అలా కాకుండా గవర్నమెంట్ ఆస్పత్రికి ఎందుకు వెళ్లకూడదని ప్రభుత్వ తరపు న్యాయవాది తన వాదనను కోర్టు దృష్టికి తీసుకెళతారు. ఈ రెండు విన్నతర్వాత కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు ఈ కేసులో జరిగింది కూడా ఇదే.
రజనీకాంత్ః కోర్టు ఎప్పుడూ ప్రైవేట్ ఆస్పత్రికి రెకమెండ్ చేసే అవకాశం ఉండదని అంటున్నారు? అలాంటిది ఏమైనా ఉంటుందా?
లక్ష్మినారాయణః అలాంటిది ఏమీ లేదు. ట్రీట్‌మెంట్ ఎక్కడ ఇప్పించాలనేది జడ్జిలు నిర్ణయిస్తారు. వాళ్లకు ఆ పవర్స్ ఉంటాయి. ఫైనల్‌గా సుప్రీంకోర్టు ఆర్మీ ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ జరపాలని నిర్ణయించింది. అంతిమంగా ఏదైనా న్యాయస్థానమే నిర్ణయిస్తుంది.
ఇలా ఆసక్తికరంగా డిబేట్ సాగింది. ఎంపీకి ప్రత్యేక ప్రివిలేజస్ ఉంటాయని ఇంతకాలం టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా చేస్తున్న వాదనలో పసలేదని సీబీఐ మాజీ అధికారి లక్ష్మినారాయణ స్పష్టంగా చెప్పారు. దీంతో రఘురామకృష్ణంరాజుకు ప్రత్యేక ప్రివిలేజస్ ఉండవని, ఆయన అరెస్ట్‌కు సంబంధించి లోక్‌సభ స్పీకర్‌కు ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని తేలిపోయింది.
అలాగే రఘురామ అరెస్ట్, భద్రతకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ఎంపీలు రాసిన లేఖల వల్ల కలిగే ప్రయోజనాలు శూన్యమని తేలిపోయింది. ఇదంతా కేవలం పొలిటికల్ స్టంట్ అని స్పష్టమైంది. దీంతో టీడీపీ గత కొన్ని రోజులుగా చేస్తున్న హడావుడి అంతా లక్ష్మినారాయణ మాటలతో తుడిచి పెట్టుకుపోయింది.