కరోనా కష్టకాలంలో అమ్మఒడి ఎందుకు? రైతు భరోసా ఎందుకు? అంటూ వితండవాతం చేసేవారు కొంతమంది ఏపీలో ఉన్నారు. అదే సమయంలో కష్టకాలంలో సీఎం జగన్, ప్రజల్ని పరోక్షంగా ఆదుకుంటున్నారనే వారు కూడా ఉన్నారు. కరోనా కష్టంలో అందే సాయం ఎంత అనేదాని కంటే, అసలు సాయం చేస్తున్నారా లేదా అనేది ముఖ్యం.
ఏపీలో కరోనా బాధితులకు ఆరోగ్యశ్రీ ఎంతగానో ఉపయోగపడుతోంది. ప్రతి ప్రైవేటు ఆస్పత్రులో కచ్చితంగా ఆరోగ్యశ్రీ కింద కరోనా వ్యాధిగ్రస్తుల్ని చేర్చుకోవాల్సిందే, వారికి కార్పొరేట్ స్థాయి చికిత్స అందించాల్సిందే, అది కూడా పూర్తి ఉచితంగా.
ఆరోగ్యశ్రీ పథకంలో ఎవరెవరు, ఎన్ని మార్పులు చేసినా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దాన్ని ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ కే ఆ ఘనత దక్కుతుంది. అయితే తెలంగాణలో మాత్రం ఆరోగ్యశ్రీ అమలుతీరుపై తీవ్ర విమర్శలున్నాయి. కరోనా చికిత్సను ఇప్పటి వరకు కేసీఆర్ సర్కారు ఆరోగ్యశ్రీలో చేర్చలేదు.
పేదలైనా, మధ్యతరగతివారైనా, కరోనా వస్తే, ప్రభుత్వ ఆస్పత్రిలో బెడ్ దొరక్కపోతే ఇక వారి సంగతి అంతే. కార్పొరేట్ ఆస్పత్రుల్లో లక్షలకు లక్షలు ముందస్తుగానే తీసుకుంటున్నారు. ఆస్తులమ్ముకున్నా అయినవాళ్లు ప్రాణంతో తిరిగొస్తారన్న భరోసా కూడా లేదు.
ఈ దశలో ఏపీని ఉదాహరణగా చూపిస్తూ… తెలంగాణలో కూడా కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలనే డిమాండ్ ఊపందుకుంది. కాంగ్రెస్, బీజేపీ, ఇతర విపక్షాలన్నీ కేసీఆర్ పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి.
ఓ దశలో మంత్రి కేటీఆర్ కూడా కరోనాతో పేదలు పడుతున్న ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయని, కచ్చితంగా కేసీఆర్ తో మాట్లాడి కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేరుస్తామని హామీ ఇచ్చారు. అయినా కూడా సీఎం కేసీఆర్ ఎందుకో మీనమేషాలు లెక్కిస్తున్నారు.
మరోవైపు కరోనా కష్టకాలంలో సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో కేసీఆర్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. కరోనా మృతుల అంత్యక్రియల కోసం 15వేల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటిస్తూ ఇటీవలే వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఇరుకున పడింది.
సీఎం జగన్ అక్కడితో ఆగలేదు. బ్లాక్ ఫంగస్ చికిత్సను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరుగుతుందనేది కాదనలేని వాస్తవం. అసలు కరోనా చికిత్సనే వారింకా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకు రాలేదు.
ఇక్కడ జగన్ మాత్రం కరోనాతో పాటు, దాని అనుబంధ రోగాలను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చి పేదలకు ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు.