నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. హైకోర్టులో బెయిల్ రాకపోవడం, కింది కోర్టును ఆశ్రయించాలని ఆదేశించిన తర్వాత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
హైకోర్టు ఆదేశాల మేరకు రఘురామకృష్ణం రాజును గుంటూరు ఆరో అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎదుట హాజరుపరిచారు. పోలీసులు తనను కొట్టారని రఘురామకృష్ణం రాజు తీవ్ర ఆరోపణలు చేశారు. తన ఒంటిపై, కాళ్లపై గాయాలయ్యాయని ఆయన కింది కోర్టు జడ్జికి ఫిర్యాదు చేశారు.
ఇదే విషయమై హైకోర్టుకు రఘురామకృష్ణంరాజు తరపు న్యాయవాదులు లేఖ రాశారు. ఎంపీని కొట్టడంపై హైకోర్టు మండిపడింది. రాష్ట్రంలో అసలేం జరుగుతోందని హైకోర్టు ఘాటు వ్యాఖ్య చేసింది. కస్టడీలోని ఎంపీని ఎలా కొడతారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంపీ శరీరంపై ఉన్నవి పోలీసు దెబ్బలని తేలితే తీవ్ర పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్రభుత్వాన్ని, పోలీసులను హైకోర్టు హెచ్చరించింది.
హైకోర్టు ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు మాత్రం రఘురామకృష్ణంరాజుపై ఎలాంటి కొట్టిన ఆనవాళ్లు లేవని నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
జ్యుడీషియల్ కస్టడీలో భాగంగానే రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. జ్యుడీషియల్ అధికారిని నియమించాలని తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. వైద్య పరీక్షలను వీడియోతో చిత్రీకరించాలని సూచించింది. సీల్డ్ కవర్‌లో నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
మరోవైపు సీఐడీ పోలీసులు, ప్రభుత్వం మాత్రం ఎంపీపై చేయి చేసుకోలేదని ధీమాగా చెబుతోంది. పైపెచ్చు హైకోర్టులో బెయిల్ పిటిషన్ డిస్మిస్ కావడంతో , సరికొత్త డ్రామాకు తెరలేపారని ప్రభుత్వం వాదిస్తోంది.
ఒకవేళ సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి మెడికల్ బోర్డు కూడా ఎంపీపై కొట్టిన దెబ్బలు లేవని నివేదిక ఇస్తే? అప్పుడు కోర్టును, సమాజాన్ని తప్పుదోవ పట్టించినందుకు కఠిన చర్యలుంటాయా? అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న.
సీఐడీ పోలీసులు కొట్టినట్టు తేలితే కఠిన చర్యలుంటాయని హెచ్చరిస్తున్నప్పుడు, కొట్టకపోయినా తప్పుడు ఫిర్యాదు చేసిన ఎంపీపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి కదా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.