తాను ద్వేషించే రాజకీయ నాయకుడు పాలకుడు కావడంతో ఆంధ్రజ్యోతి విచక్షణ మరిచి రాతలు రాస్తోంది. జగన్ సర్కార్ ఏం చేసినా …తలకిందులుగా చూడాలని ఆంధ్రజ్యోతి -ఏబీఎన్ మీడియా సంస్థ ఓ నిర్ణయం తీసుకున్నట్టుంది. చివరికి ఆక్రమణలను కూడా సమర్థించే దిగజారుడు రాతలు రాయడానికి ఆంధ్రజ్యోతి వెనుకాడలేదంటే… జగన్‌పై ద్వేషం ఆ పత్రికను అంధజ్యోతిగా మార్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
‘వైసీపీలోకి రాకుంటే జేసీబీలే’ శీర్షికతో నేడు ఆంధ్రజ్యోతిలో ఓ కథనాన్ని ప్రచురించారు. ఈ కథనంలో కీలక అంశాలపై రాతలను పరిశీలిద్దాం.
‘గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును వైసీపీలోకి తీసుకురావాలని అధికార పార్టీలో అనేక మంది ప్రయత్నించారు. ఆయన లొంగలేదు. దాంతో ఆయనపై కక్ష కట్టారు. ఆయన గాజువాక జంక్షన్‌లో నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్‌లో నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ.. ఓ తెల్లవారుజామున జేసీబీతో భవనాన్ని కూలగొట్టారు. అక్కడితో ఆగకుండా ఆయన అక్రమాలకు పాల్పడ్డారంటూ మానసికంగా వేధిస్తున్నారు’ అని రాసుకెళ్లారు. నాణేనికి ఒక వైపు మాత్రమే ఆంధ్రజ్యోతి చూపుతోంది.
నాణేనికి రెండో వైపు చూద్దాం. గాజువాక నియోజకవర్గంలో మూడు రెవెన్యూ గ్రామాల పరిధిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బంధువుల కబ్జాలో ఉన్న రూ.669.26 కోట్లు విలువైన 38.45 ఎకరాల్ని రెవెన్యూ అధికారులు నిన్న (ఆదివారం) స్వాధీనం చేసుకున్నారు. కొన్నేళ్లుగా ఈ భూముల్ని పల్లా సోదరుడు శంకరరావు, ఇతర బంధువులు ఆక్రమించుకోవటమే కాక… వాటిని ప్రైవేటు వ్యక్తులకు లీజుకిచ్చేసి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారనేది ప్రభుత్వ వాదన. భూముల్ని స్వాధీనం చేసుకుని అందులో ఉన్న నిర్మాణాలను జేసీబీలతో తొలగించారు.
ఇదే కాకుండా గత ఏడాదిగా విశాఖ నగరంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూముల సంరక్షణపై జిల్లా రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ గడిచిన ఏడాది కాలంలో ఏకంగా రూ.4,291.41 కోట్లు విలువ చేసే 430.81 ఎకరాల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. విశాఖ రూరల్ మండలంలోనే అత్యధికంగా రూ.1,691 కోట్ల విలువైన భూముల్ని స్వాధీనం చేసుకోవడం గమనార్హం.
భూఆక్రమణదారుల్లో ప్రధానంగా దివంగత టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ మూర్తి గీతం విద్యాసంస్థల పేరుతో , మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా బంధువైన జనసేన నాయకుడు పరుచూరి భాస్కరరావు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఆయన బంధువులున్నారు.
విశాఖతో పాటు సమీప ప్రాంతాల్లో భూఆక్రమణలపై ఇదే ఆంధ్రజ్యోతి ఎందుకని చంద్రబాబు హయాంలో ఒక్క కథనాన్ని కూడా రాయలేదు? తనకు యాడ్స్ రూపంలో భారీ మొత్తంలో చంద్రబాబు ప్రభుత్వం నుంచి రాబడి ఉండడంతో నోరు కట్టేసుకున్నారా?
ఇప్పుడు జగన్ సర్కార్ నుంచి దమ్మిడి ఆదాయం కూడా లేకపోవడంతో కడుపు మండి ఆక్రమణదారులకు కొమ్ము కాయడం ఒక్క ఆంధ్రజ్యోతికే చెల్లింది. నాడు చంద్రబాబు హయాంలో మాత్రం ఆక్రమణలకు వంతపాడుతూ… మీకింత, మాకింత అన్న ధోరణిలో ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ దోపిడీలో భాగస్వామ్యం అయిందా అనే నిలదీతలు వెల్లువెత్తుతున్నాయి.
నిజంగా ప్రజలు, బాధితుల పక్షాన ఓ మీడియా సంస్థగా నిలబడాలనే ఉన్నత విలువలకు కట్టుబడి ఉంటే ఆంధ్రజ్యోతి ఇంత గుడ్డిగా ఆక్రమణల తొలగింపులను సమర్థించేది కాదని సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు. కేవలం జగన్ పాల నను తప్పు పట్టడమే ఎజెండాగా, తనకు తాను పతనం చేసుకుంటోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గడిచిన ఏడాది కాలంలో ఏకంగా రూ.4,291.41 కోట్లు విలువ చేసే 430.81 ఎకరాల్ని జగన్ సర్కార్ కాపాడ్డం కూడా ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ దృష్టిలో నేరమైతే … ఆ మీడియా సంస్థ ఎవరి పక్షమో అర్థం చేసుకోవచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
అయినా చంద్రబాబుకు కొమ్ముకాసే ఆంధ్రజ్యోతి నుంచి ఇంత కంటే ఉన్నతమైన రాతలు ఆశించడం అత్యాశే అవుతుందనే వాళ్లు లేకపోలేదు. భూకబ్జాదారులకు దన్నుగా కథనాలు రాసేవాళ్లకు ఎలాగుందో తెలియదు కానీ, చదవడానికి మాత్రం సిగ్గుగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.