పాపికొండల విహారానికి వెళ్లిన పర్యాటకులు కొందరు అనుకోని ప్రమాదం పాలయ్యారు. అంతవరకూ ఆ అందాల మధ్యన వారు విహరించిన బోటు ప్రమాదానికి గురి కావడంతో పన్నెండు మంది మరణించినట్టుగా తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా కంచులూరు వద్ద బోటు ప్రమాదానికి గురి అయ్యింది. రెండంతస్తుల ఈ బోటులో దాదాపు అరవై మంది ప్రయాణించినట్టుగా తెలుస్తోంది.
మొదటి అంతస్తులోని వారు రెండో అంతస్తులోకి వెళ్లే ప్రయత్నం చేయగా.. బోటు ప్రమాదానికి గురి అయ్యిందనేది ఒక కథనం. అలాగే ప్రమాదానికి గురి అయిన బోటుకు అనుమతి కూడా లేదని తెలుస్తోంది. సుడిగుండాలు ఉండే చోటులో డ్రైవర్లు సరిగా వ్యవహరించకపోవడంతోనే బోటు ప్రమాదానికి గురి అయ్యిందని కూడా అంటున్నారు.
ప్రమాదంలో పలువురు అస్వస్థతకు గురి అయ్యారు. వారికి చికిత్స కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రమాదం నుంచి పలువురు సురక్షితంగా బయట పడ్డారు. హైదరాబాద్ కు చెందిన కొందరు, వరంగల్ కు చెందిన మరి కొందరు యాత్రికుల్లో ఉన్నారని తెలుస్తోంది. బోటు ప్రమాదంపై ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు, ముఖ్య నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. చికిత్స పొందుతున్న వారిని ఏపీ మంత్రులు పరామర్శించారు.