Advertisement

Advertisement


Home > Politics - Gossip

అంకెలగారడీ బడ్జెట్‌ - తప్పు కేసీఆర్‌దా.. మోడీదా!

అంకెలగారడీ బడ్జెట్‌ - తప్పు కేసీఆర్‌దా.. మోడీదా!

తెలంగాణ ధనికరాష్ట్రం.. ఇది తరచుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పేమాట. అలాంటి ధనికరాష్ట్రం ఇప్పుడు సంక్షోభంలో ఉందని బడ్జెట్‌ విశ్లేషణలు వెల్లడించాయి. ముఖ్యమంత్రి స్వయంగా బడ్జెట్‌ ప్రవేశపెట్టడం ఒక ఆసక్తికరమైన అంశం అయితే బడ్జెట్‌లో గత అంచనాలతో పోల్చితే ఇరవైశాతం కోతపెట్టడం మరో సంచలనం. బహుశా దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలోను ఇలా జరిగి ఉండకపోవచ్చు. అందుకు కారణాలను కేసీఆర్‌ వివరిస్తూ కేంద్ర విధానాలను, ఆర్థిక మాంద్యాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. తద్వారా పరోక్షంగా కేంద్రంపైన, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపైన ఆయన దాడిచేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడు ఇలాంటి అనుభవం లేదు. ప్రతి సంవత్సరం పదిశాతం పెంచి అంకెలు వేసి బడ్జెట్‌ సమర్పించడం ఆర్థికశాఖకు అలవాటైన విధానంగా ఉంటుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి ప్రాధాన్యతల ప్రకారం ఆయా శాఖలకు కేటాయింపులలో మార్పులు, చేర్పులు ఉంటాయి. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్షకోట్ల బడ్జెట్‌ను ఆనాటి ఆర్థికమంత్రిగా రోశయ్య ప్రవేశపెట్టారు. అప్పట్లో అదో పెద్ద వార్త. ఆ తర్వాత అది లక్షన్నర కోట్ల వరకు చేరింది. అంతలో రాష్ట్ర విభజన జరిగింది. సహజంగానే బడ్జెట్‌లు తగ్గుతాయని అంతా అనుకున్నారు.

కాని తెలంగాణలో కేసీఆర్‌, ఏపీలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులు పోటీలుపడి బడ్జెట్‌ను అంకెల గారడీగా మార్చేశారు. రెండు రాష్ట్రాలకు కలిపి మూడులక్షల కోట్లకు పైగా బడ్జెట్‌ పెట్టామనిపించారు. నిజంగా అంత మొత్తం ఆదాయం ఉందా? లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా బడ్జెట్‌లు సాగిపోయాయి. ఆయా శాఖలకు వేలకోట్లు కేటాయించడం, ఆ తర్వాత వాటిని ఖర్చు చేయకపోవడం మామూలు విషయంగానే ఉంది. ఎందుకంటే ప్రభుత్వం వద్ద డబ్బు ఉంటే కదా?.

నాలుగు నెలల క్రితం కేసీఆర్‌ తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పుడు లక్ష ఎనభైవేల కోట్లకు లెక్కలు వేశారు. ఇప్పుడు కొద్దినెలల వ్యవధిలో అదికాస్తా లక్షా నలభై ఐదువేల కోట్లకు పడిపోయింది. మొత్తంమీద 35 వేలకోట్లకు పైగా మొత్తాన్ని తగ్గించారన్నమాట. ఇది వాస్తవిక బడ్జెట్‌ అని టీఆర్‌ఎస్‌ అనుకూల మీడియా అభివర్ణించింది. అది వేరే విషయం. ఒకరకంగా దీనిని ఒప్పుకోవాలి. నేలవిడిచి సాముచేయడం కన్నా, ఉన్న వనరులతో వాస్తవిక బడ్జెట్‌ రూపొందిస్తే అది ఆ రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యానికి మేలుచేస్తుంది.

అలాకాకుండా పిచ్చి లెక్కలతో, ఊహాలతో బడ్జెట్‌లు వేసుకుంటూపోతే ఎప్పుడో ఒకప్పుడు ఆ బుడగ పేలకతప్పదు. ఒకరకంగా చెప్పాలంటే ఇప్పుడు ఆ బుడగను కేసీఆర్‌ స్వయంగా చూపించి పక్కనబెట్టారని అనుకోవచ్చు. ఇక అప్పుల విషయం కూడా జీర్ణించుకోలేనిదేనని చెప్పాలి. 2.80 లక్షల కోట్లకు అప్పుచేరింది హద్దులు దాటిచేస్తున్న అప్పులు ప్రజలపై భారానికి దారితీస్తాయి. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకే లక్షకోట్ల వ్యయం చేయవలసిన పరిస్థితి. అందులో అధికభాగం అప్పుల రూపంలో తేవల్సిందే. ఇక అనేకహామీలు అలాగే పెండింగులో ఉన్నాయి.

ప్రభుత్వ తీరు తెన్నులు ఇలా ఉంటే నిజంగానే కేంద్రం నుంచి రావల్సిన నిధులు రాకపోవడం వల్ల, ఆర్థికమాంద్యం వల్లే ఈ సంక్షోభం ఏర్పడిందని చెబుతున్న కేసీఆర్‌ మాటలను పూర్తిగా అంగీకరించలేం. కొంత వాస్తవం ఉండవచ్చు. కాని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయాలలో ఆచరణాత్మకంగా వ్యవహరించలేకపోయిందని ఈ బడ్జెట్‌ అంకెలు చెబుతున్నాయి. తెలంగాణలో బీజేపీ దూకుడుగా వెళ్లాలని ఆలోచిస్తున్న నేపధ్యంలో కేసీఆర్‌ వ్యూహాత్మంగా మొత్తం అన్ని సమస్యలకు కేంద్రం మూలం అన్న బావన కల్పించడానికి ఆయన కృషి చేసినట్లుగా ఉంది.

అందుకే ఆర్థికమంత్రి హరీష్‌రావు బదులు తానే ఈ ప్రసంగాన్ని అసెంబ్లీలో చదివారని అంటారు. బీజేపీని కట్టడి చేయడానికి, భవిష్యత్తులో కేంద్రంపై పోరాటానికి కేసీఆర్‌ అవసరమైతే సన్నద్ధమవుతున్నారన్న సంకేతం ఇచ్చారు. తెలంగాణ నుంచి రెండులక్షల కోట్ల ఆదాయం గత ఐదేళ్లలో కేంద్రానికి వెళితే తెలంగాణకు 35 వేల కోట్లరూపాయల మేరే వచ్చిందని ఆయన చెబుతున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ కేంద్రం నుంచి ఇరవైవేల కోట్ల రూపాయలు రావల్సి ఉందని ఆరోపించారు. అయితే కేంద్రంపై నెట్టి కేసీఆర్‌ చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్‌, బీజేపీలు విమర్శించాయి.

మారని తీరు.. అదే కుట్రల, కుతంత్రాల రాజకీయం!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?