జగన్ పాలనపై దేశం షో అట్టర్ ఫ్లాప్
అధికారంలోకి వచ్చి పట్టుమని నూరురోజులు కూడా పూర్తిచేసుకోని జగన్ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లాలో చేపట్టిన పోరుబాట అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ముచ్చటగా మూడునెలల పాటు సాగిన ప్రభుత్వ పాలనపై ఓ వైపు వైకాపా శ్రేణులు పండుగ చేసుకుంటున్న నేపథ్యంలో ఇంకోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా కేంద్రంగా ప్రభుత్వంపై నిప్పులు చెరిగేందుకు ముంచుకొచ్చారు. అయితే జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని జనంలో పండగట్టేందుకు అవసరమైన మెటీరియల్ లేకపోవడంతో కేవలం ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించేందుకు మాత్రమే మాజీ ముఖ్యమంత్రి పరిమితమయ్యారు.
వాస్తవానికి జగన్ ప్రభుత్వం విధి విధానాలను ఓ ఆరునెలల పాటు జాగ్రత్తగా పరిశీలించాకే జనంలోకి రావాలని చంద్రబాబు ఆశించారు. అయితే కోడి ముందే కూసిన చందాన బాబు అంతవరకూ ఆగలేకపోయారు. ఈ నేపథ్యంలో వందరోజుల పాలనపై అధికార పార్టీ నేతలు ఆనందోత్సాహాలను వ్యక్తంచేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు తొలిసారిగా తూర్పు గోదావరి జిల్లా నుండి ప్రభుత్వంపై ఆందోళన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం తొలిసారిగా జిల్లాకు వచ్చిన చంద్రబాబుకు రాజమహేంద్రవరం, కాకినాడ నగరాల్లో పసుపు శ్రేణులు బ్రహ్మరథం పట్టారు. రెండురోజుల పాటు జిల్లాలో బసచేసిన బాబు నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు.
కాకినాడలో జరిగిన సభలో ముఖ్యమంత్రి జగన్‌పై బాబు ధ్వజమెత్తారు. రాష్ట్రం రౌడీరాజ్యంగా మారిందని, తెలుగుదేశం కార్యకర్తలపై అధికార పార్టీ దాడులకు తెగబడుతోందని ఆరోపించారు. వాస్తవానికి జగన్‌కు వ్యతిరేకంగా చంద్రబాబు సాగించిన ఈ యాత్రలో దేశం కార్యకర్తలపై జరుగుతున్న దాడులనే ప్రధానంగా చిత్రీకరించేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. పోలవరం రివర్స్ టెండరింగ్‌పై మాజీ ముఖ్యమంత్రి ఆగ్రహిస్తూ రాష్ట్రాభివృద్ధి కూడా రివర్స్ డెవలప్మెంట్ పద్ధతిలో సాగుతోందని ఎద్దేవా చేశారు.
రాజధానిని తరలిస్తారంటూ జరుగుతోన్న ప్రచారం నుండి అన్న క్యాంటిన్ల మూసివేత వరకూ ఇలా ఆయా అంశాలను చంద్రబాబు తమకు అనుకూలంగా మార్చుకుని జనానికి చెప్పేందుకు ప్రయత్నించారు. అయితే చంద్రబాబు చెప్పిన ఈ అంశాలేవీ జనానికి ఎక్కినట్టు కనిపించలేదు! కనీసం దేశం శ్రేణులు సైతం వీటిని సీరియస్‌గా తీసుకున్న దాఖలాల్లేవు! ఇందుకు కారణం జగన్ ప్రభుత్వం ఇంకా మొగ్గదశలో ఉండటమేనన్న విషయం స్పష్టమయ్యింది. అలాగే ప్రతిపక్ష నేత ఆరోపణలను వైకాపా నేతలు తిప్పికొట్టగలిగారు.
చంద్రబాబు ఆరోపించినట్టు రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించిన దాఖలాల్లేవని, ఆ మాటకొస్తే తెలుగుదేశం ప్రభుత్వంలోనే రౌడీయిజం ఉండేదని, ఇపుడు రాష్ట్రంలో పరిస్థితులు అదుపులో ఉన్నాయని వైకాపా నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో వైకాపా శ్రేణులపై పెద్దఎత్తున దాడులు జరిగాయని గుర్తుచేస్తున్నారు. అలాగే జగన్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే అనేక సమస్యలను పరిష్కరించే దిశగా సాగుతున్నారని, అవినీతికి తావులేకుండా లక్షదాది ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కృషి చేస్తున్నారని చెబుతున్నారు.
తెలుగుదేశం 2014లో అధికారంలోకి వచ్చాక నాలుగున్నరేళ్ళ పాటు స్వంత లాభానికి పరిమితమై ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని విమర్శిస్తున్నారు. చివరి ఆరునెలలూ డ్వాక్రా, రైతులకు కంటితుడుపుగా మేలు చేశారని, అన్న క్యాంటిన్లు చివరి నిముషంలో ఏర్పాటు చేశారని, ఇంకా అనేక పథకాలను ఎలక్షన్ స్టంట్స్‌లో భాగంగా ప్రకటించారని ఎద్దేవా చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం ఆ మాదిరిగా కాకుండా అధికారం చేపట్టిన నాటి నుండి ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తోందని వైకాపా నాయకులు అభిప్రాయపడుతున్నారు.