వివేకా హత్య కేసుపై రాజకీయ మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార పక్షం వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పరస్పరం విమర్శల దాడికి దిగాయి. వివేకా హత్య కేసును అడ్డు పెట్టుకుని రాజకీయ పబ్బం గడుపుకునే క్రమంలో ఆ రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి. వివేకా హత్య కేసు, సీబీఐ చార్జిషీట్లో నిందితుల పేర్లను ఆసరాగా తీసుకుని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మార్క్ విమర్శలకు దిగారు. ఈయనకు టీడీపీ సీనియర్ నేత బొండా ఉమా తోడయ్యారు.
వైసీపీ తరపున ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఒంటరిపోరు చేస్తున్నారు. ప్రధానంగా చంద్రబాబు కుట్ర రాజకీయాలపై సజ్జల నిప్పులు చెరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో వరుసగా రెండు రోజులు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి చంద్రబాబు ఓ పథకం ప్రకారం వ్యవస్థల్ని అడ్డు పెట్టుకుని కడప ఎంపీ అవినాశ్‌రెడ్డిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో సజ్జలకు శనివారం బోండా ఉమా కౌంటర్ ఇచ్చారు.
వివేకా హత్య కేసులో రాష్ట్ర ప్రభుత్వ విచారణపై నమ్మకం లేకపోవడం వల్లే ఆయన కుమార్తె డాక్టర్ సునీత సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారన్నారు. ఈ క్రమంలో ఆమె న్యాయపోరాటానికి దిగడాన్ని బోండా ఉమా గుర్తు చేశారు. వివేకా హత్య కేసులో నివ్వెరపోయే నిజాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయన్నారు. వివేకా హత్య కేసులో నిందితులే సీబీఐని బెదిరించే ధోరణి కనిపిస్తోందన్నారు.
ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏకంగా సీబీఐపై దాడికి దిగడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. హత్య కేసులో నిందితుడైన దస్తగిరి అప్రూవర్‌గా మారడంతో తాడేపల్లిలో వణుకు మొదలైందన్నారు. కడప ఎంపీ అవినాశ్‌రెడ్డిని కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వివేకా హత్య కేసులో నిందితులను ప్రభుత్వమే కాపాడేందుకు ప్రయత్నించడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. హత్య జరిగిన రోజు నిందితులైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, సునీల్ యాదవ్ తదితరులను చుట్టూ పెట్టుకుని సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారన్నారు.
గతంలో ప్రతిపక్ష నాయకుడిగా సీబీఐ దర్యాప్తు చేయాలని జగన్ కోర్టును ఆశ్రయించారన్నారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత 2020, ఫిబ్రవరి 6న సీబీఐ విచారణ అవసరం లేదంటూ జగన్ ఎందుకు పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. అధికారంలో లేనప్పుడు సీబీఐ కావాలని, సీఎం అయిన తర్వాత మాత్రం విచారణ అవసరం లేదని ఎందుకు చెప్పారో ప్రజలకు సమాధానం చెప్పాలని బోండా ఉమా డిమాండ్ చేశారు.
ఇవాళ చిన్నాన్న హత్య కేసులో నిందితులను సీఎం స్థాయిలో కాపాడుతుంటూ ప్రజలు నివ్వెరపోతున్నారని విమర్శించారు. సొంత అన్న ముఖ్యమంత్రిగా పాలన సాగిస్తున్న రాష్ట్రంలో తన తండ్రి హత్యపై రాష్ట్ర ప్రభుత్వ విచారణపై నమ్మకం లేదని డాక్టర్ సునీత సీబీఐ విచారణకు వెళ్లాల్సి వచ్చిందన్నారు.
సొంత చెల్లెలైన డాక్టర్ సునీత తన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ నమ్మకం లేదని సీబీఐ విచారణ కోరారంటే… మీ పాలన ఎలా వుందో తెలుసుకోవాలని కోరారు. సీబీఐని సజ్జల ప్రశ్నించడం ఏంటో అర్థం కావడం లేదన్నారు. ఈయన ప్రభుత్వానికి సలహాదారుడా లేక సీబీఐకా అని బోంగా ఉమా వ్యంగ్యంగా ప్రశ్నించారు.