ఆంధ్రప్రదేశ్ లో అనధికారిక విద్యుత్ కోతలు అమలవుతున్నాయి, గ్రామాలు చీకటిలో మగ్గిపోతున్నాయంటూ ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ తిప్పికొట్టారు. గ్రామాల్లోకి వెళ్దాం రమ్మంటూ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కోతలు లేవంటున్నారు మంత్రి.
“విద్యుత్ కోతలు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. ఎన్టీపీసీకి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి పేమెంట్లు చెల్లింపులో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిన ఫలితంగానే 2-3 రోజులు ఇబ్బందులు ఏర్పడ్డాయి. వాటిని మేము కూడా అంగీకరిస్తున్నాం. ఆ సమస్య సద్దుమణిగిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కోతలు లేవు. కానీ కోతలు అంటూ అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. దీనిపై 2 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు, టీడీపీ నాయకులు, ఏబీఎన్, ఈటీవీ, టీవీ5 ఛానల్స్ ఇష్టమొచ్చినట్లు విమర్శలు, వరుస కథనాలు ప్రసారం చేస్తున్నాయి. విద్యుత్ కోతలు ఎక్కడ ఉన్నాయో చూపించండి.. గ్రామాల్లోకి వెళదాం రండి.”
ప్రత్యేక హోదాపై టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని కూడా తిప్పికొట్టారు మంత్రి. స్పెషల్ స్టేటస్ అంశం ఇంకా సజీవంగా ఉందంటే అది వైసీపీ వల్లనే అన్నారు. చంద్రబాబులా రోజుకో మాట మాట్లాడ్డం తమ ప్రభుత్వానికి అలవాటు లేదన్నారు.
“ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి అత్యవసరం అని పదే పదే చెబుతున్నాం. దాని కోసమే పోరాడుతున్నాం. చంద్రబాబు లా మేం లాలూచీ పడం, ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టం. కేంద్రంలో మన అవసరం లేని ప్రభుత్వాన్ని భగవంతుడు తీసుకు రావటం వల్లే ఈ పరిస్థితి. అయినా, ప్రత్యేక హోదాను సజీవంగా ఉంచి, పోరాడి, సాధించుకుని తీరతాం.”
వైసీపీ సర్కారు 3 రాజధానుల అంశానికి కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మరోసారి ప్రకటించారు బొత్స. 3 రాజధానులే ప్రభుత్వ విధానమని, విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయి తీరుతుందన్నారు.