మొన్నటికిమొన్న కత్రినాకైఫ్-విక్కీ కౌశల్ పెళ్లి చేసుకున్నారు. నిన్నమొన్నటివరకు వాళ్ల పెళ్లి ఫొటోలు హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. అంతలోనే మరో సెలబ్రిటీ కపుల్ పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లుగా డేటింగ్ లో ఉన్న ఫర్హాన్ అక్తర్, షిబానీ దండేకర్ ఈరోజు పెళ్లితో ఒక్కటయ్యారు. ఖండాలాలో తండ్రి జావెద్ అక్తర్ కు చెందిన ఫామ్ హౌజ్ లో, అతికొద్ది మంది సమక్షంలో సింపుల్ గా వీళ్ల పెళ్లి జరిగింది.
నటుడు, దర్శకుడు, గాయకుడు, నిర్మాత, కథా రచయితగా బాలీవుడ్ లో ఫర్హాన్ అక్తర్ కు మంచి పేరుంది. దిల్ చాహతా హై, డాన్ లాంటి సినిమాలు తీసింది ఇతడే. భాగ్ మికా భాగ్ తో దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నాడు. ఇప్పుడు పెళ్లితో మరోసారి వార్తల్లో నిలిచాడు. ఫర్హాన్ కు ఇది రెండో పెళ్లి. చాన్నాళ్ల కిందటే అతడికి పెళ్లయింది. ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. 2017లో మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు.
ఇక షిబానీ దండేకర్ విషయానికొస్తే.. 2015లో వచ్చిన ఓ రియాలిటీ షోలో షిబానీని తొలిసారి కలిశాడు ఫర్హాన్. ఆ షోకు ఫర్హాన్ హోస్ట్ గా వ్యవహరించగా.. షిబానీ కంటెస్టెంట్ గా కనిపించింది. అప్పుడే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కొన్నాళ్లకే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. షిబానీతో ప్రేమలో పడిన తర్వాతే ఫర్హాన్, తన భార్యకు విడాకులిచ్చాడు.
తమ ప్రేమ విషయాన్ని ఫర్హాన్-షిబానీ దాచే ప్రయత్నం చేయలేదు. రణబీర్-దీపిక పెళ్లికి కలిసి హాజరై తొలిసారిగా మీడియాకు అధికారికంగా కనిపించింది ఈ జంట. ఇప్పుడు పెళ్లితో ఒకటయ్యారు. షిబానీ క్లోజ్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ఈ పెళ్లికి హాజరైంది. మెహందీ ఫంక్షన్ లో హంగామా అంతా ఆమెదే.