2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచే అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీని ఎదుర్కోవాలంటే టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఒక్కటే మార్గమని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బలంగా నమ్ముతున్నారు. ఒకవేళ పొత్తులు లేకపోతే మాత్రం… మరోసారి 2019 ఫలితమే పునరావృతం అవుతుందని చంద్రబాబు ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో గత నెలలో కుప్పం పర్యటనలో భాగంగా జనసేనతో పొత్తుపై కార్యకర్త అడిగిన ప్రశ్నకు చంద్రబాబు కొంటే సమాధానం చెప్పారు. జనసేనతో తమది ఒన్‌సైడ్ లవ్ సాగుతోందని, అటు వైపు నుంచి కూడా సానుకూల స్పందన రావాలి కదా? అని చంద్రబాబు ప్రశ్నించడం పెద్ద చర్చనీయాంశమైంది. చంద్రబాబు కన్ను కొట్టడంపై జనసేనాని పవన్ స్పందిస్తూ.. ఇదంతా మైండ్‌గేమ్‌గా పార్టీ శ్రేణులకు చెప్పుకొచ్చారు.
ఈ నేపథ్యంలో ఇవాళ జనసేన కీలక నాయకుడు నాదెండ్ల మనోహర్ టీడీపీతో పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఆలోచనలకు సానుకూలంగా ఆయన అభిప్రాయాలున్నాయని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. రాష్ట్రానికి మేలు జరిగేలా పొత్తులుంటాయనేది నాదెండ్ల మనోహర్ అభిప్రాయం. టీడీపీతో పొత్తును ఆయన ఖండించలేదు. పొత్తులపై ఆయన ఏమన్నారో మనోహర్ మాటల్లోనే ….
“అది రాజకీయపరంగా తీసుకోవాల్సిన నిర్ణయం. సరైన సమయంలో మా పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ అందరితో సంప్రదించి పొత్తులపై నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్రంలో ప్రతిరోజు అనేక కొత్త పరిస్థితులు వస్తున్నాయి. ఆ రాజకీయ పరిణామాలను ఆధారం చేసుకుని జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో ఇంకా బలంగా ఎదిగేటట్టు కృషి చేస్తున్నాం. ప్రజలకు, రాష్ట్రానికి మేలు జరిగేలా సరైన సమయంలో మా అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ స్పందిస్తారని మేమందరం ఆశిస్తున్నాం” అని స్పష్టం చేశారు.
ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్నామని ఆయన చెప్పలేదు. అలాగే బీజేపీతో మాత్రమే కలిసి 2024 ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆయన అనలేదు. ప్రతిరోజూ రాష్ట్రంలో కొత్త పరిస్థితులు వస్తున్నాయని, అందుకు తగ్గట్టుగా ప్రజలకు, రాష్ట్రానికి మేలు జరిగేలా సరైన సమయంలో పొత్తులపై పవన్‌కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకుంటారని చెప్పడం ద్వారా… టీడీపీతో పొత్తుకు పరోక్షంగా సంకేతాలు ఇచ్చారని చెప్పొచ్చు.
టీడీపీ, జనసేన వేర్వేరుగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలి, అంతిమంగా వైసీపీ లాభపడుతుందనే అభిప్రాయంలో ఆ రెండు పార్టీలు ఉన్నట్టు నాదెండ్ల అంతర్గత అభిప్రాయంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంటే బాబు లవ్ ప్రపోజల్‌కు అటు వైపు నుంచి కొంత సానుకూల స్పందన వచ్చినట్టే అని టీడీపీ శ్రేణులు సంబరపడుతున్నాయి.