విజయనగరం జిల్లాలో వైసీపీ 2019 ఎన్నికల్లో స్వీప్ చేసింది. ఏకంగా తొమ్మిది అసెంబ్లీ, ఒక లోక్ సభ సీట్లో పాగా వేసింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ ఘోర పరాజయం పాలు అయింది. ఇక్కడ గెలవడానికి వైసీపీ గాలితో పాటు, బొత్స కుటుంబం పాత్ర కూడా ఉందని అంటారు.
బొత్స సత్యనారాయణ బంధుగణంలో చాలా మంది టికెట్లు సాధించారు. ఇక కొందరు పార్టీ కోసం పనిచేశారు. అలా ఒకరిద్దరు తప్ప గెలిచిన వారిలో సగానికి పైగా బొత్స గ్యాంగే ఉన్నారు. బొత్సకు కాంగ్రెస్ నుంచి కుడిభుజంగా ఉన్న వ్యక్తి సొంత మేనల్లుడు చిన్న శ్రీను.
బొస్త ఎక్కడ ఉన్నా కూడా ఒక్క ఫోన్ కాల్ తో జిల్లా రాజకీయాలను ఆయన సరిపెట్టేస్తారు. ఇక జగన్ పాదయాత్ర విజయవంతం కావడంలో కూడా జిల్లాలో చిన్న శ్రీను పాత్ర చాలా ఎక్కువే. ఆ విధంగా జగన్ కళ్ళలో పడిన చిన్న శ్రీనుకు ఇపుడు రాజకీయంగా మంచి రోజులు వచ్చినట్లున్నాయని అంటున్నారు.
ఎమ్మెల్యే టికెట్ కూడా అడగకుండా సార్వత్రిక ఎన్నికల్లో పనిచేసిన చిన్న శ్రీనుకు ఉత్తరాంధ్ర ప్రాంతీయ అభివ్రుధ్ధి బోర్డు చైర్మన్ పదవి ఇస్తారని ప్రచారం సాగుతోంది. అత్యంత కీలకమైన ఈ పదవిని కనుక చిన్న శ్రీనుకు ఇస్తే బొత్స రాజకీయ వారసుడిగా ఆయన పూర్తిగా ముందుకు వచ్చేసినట్లే మరి.
జగన్ సైతం యువ నేతలను ఎక్కడికక్కడ ప్రోత్సహిస్తున్నారు. వారే రేపటి ఎమ్మెల్యేలు, మంత్రులు అవుతారని కూడా ప్రచారంలో ఉంది. సీనియర్లకు ఈ దఫాతో రిటైర్మెంట్ ఇప్పించేసి వారి ఫ్యామిలీల నుంచే కొత్త వారిని తీసుకువస్తే రెండు వైపులా ఇబ్బందులు ఉండవన్నది జగన్ ఆలోచనగా చెబుతున్నారు. ఏది ఏమైనా చిన్న శ్రీను అధికార పదవిలో కుదురుకుంటే మాత్రం బొత్స రాజకీయం ఇంటికి పరిమితం కావాల్సిందేనని అంటున్నారు.