ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ఏర్పాటుకు హైకోర్టు తీర్పుతో అడ్డంకి ఏర్పడింది. ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి, పాలనా వికేంద్రీకరణ బిల్లులపై హైకోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. హైకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో, దానికి సమాధానం అన్నట్టుగా ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పవర్ ఫుల్ ఆన్సర్ ఇచ్చారు.
మూడు రాజధానుల బిల్లులపై ఏపీ హైకోర్టు తీర్పులో ప్రధానంగా పేర్కొన్న అంశాలు, వాటికి బొత్స కౌంటర్ ఏంటో చూద్దాం.
‘రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదు. లేని అధికారాలతో చట్టాన్ని రద్దు చేయలేరు. అధికారం లేనప్పుడు సీఆర్డీఏ చట్టం రద్దు కుదరదు. అమరావతి నుంచి ఏ కార్యాలయాన్ని తరలించకూడదు’ అని చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది.
ఈ తీర్పుపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ… ‘మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నాం. సీఆర్డీఏ చట్టం అమల్లోనే ఉంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఉన్నదే చట్టాలు చేయడానికి. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. మా ప్రభుత్వం విధానం మూడు రాజధానులు’ అని తన మార్క్ పంచ్‌లు విసిరారు.
బొత్స సత్యనారాయణ తాజా కామెంట్స్‌ను వైసీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది.
అసెంబ్లీ, పార్లమెంట్లను చట్టసభలని పిలుస్తారని, అవి చట్టాలు చేయకుండా, శాసన వ్యవస్థలు ఏం చేస్తాయో అర్థం కావడం లేదని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తుండడం గమనార్హం.
ఏపీ హైకోర్టు తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నచ్చిన వాళ్లు అనుకూలంగా, నచ్చని వాళ్లు వ్యతిరేకంగా తమ అభిప్రాయాల్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.
మొత్తానికి హైకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో శాసన వ్యవస్థల కర్తవ్యంపై చర్చకు తెరలేచింది.