అమరావతి రాజధాని అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పందించారు. గతంలో అమరావతి రాజధాని పేరు చెప్పి ఇష్టారాజ్యంగా భూములు దోచుకున్న చంద్రబాబు.. ఇప్పుడు తిరిగి అదే అంశంపై రిఫరెండం కోరడం విడ్డూరంగా ఉందన్నారు. బాబు మరీ అంతగా ముచ్చటపడితే రాష్ట్రవ్యాప్తంగా రిఫరెండం పెట్టుకోవచ్చన్నారు బొత్స.
“మూడు రాజధానులు ఉండాలని చట్టం చేశాం. ప్రజామోదంతోనే చేశాం. అమరావతి రాజధానికి రిఫరెండం పెడదామని బాబు కోరుకుంటే మాకు అభ్యంతరం లేదు. ఓసారి ట్రై చేసి చూడండి. వాళ్ల ఎమ్మెల్యేలు రాజీనామాలు కూడా చేస్తామంటున్నారు కదా. చేసి మళ్లీ పోటీ చేయండి చూద్దాం.”
ఏదైనా కుంభకోణంపై విచారణ జరిపిస్తే కక్షసాధింపు అనడం చంద్రబాబుకు అలవాటుగా మారిపోయిందని, విచారణ జరిపించకపోతే దమ్ములేదంటూ సవాల్ చేయడం కామన్ అయిపోయిందని బొత్స ఎద్దేవా చేశారు. టీడీపీ జనాలు ఎన్ని విమర్శలు చేసినా జరగాల్సింది జరుగుతుందని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు.
“అమరావతిలో ల్యాండ్ పూలింగ్ పేరిట వేల ఎకరాల్ని పేదలు-దళితుల్ని మభ్యపెట్టి, బెదిరించి దోచుకున్నది నిజం. చంద్రబాబు, ఆయన కొడుకు, ఆయన వర్గం దోచుకుతిన్నారు. ఇది ప్రజలందరికీ తెలిసిన నిజం. కచ్చితంగా దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తాం. సాక్ష్యాలతో విచారణ చేస్తే మాపై కక్ష కట్టారని అంటారు. విచారణ చేయకపోతే మమ్మల్ని ఏం చేయలేకపోయారు అని అంటారు. ఈఎస్ఐ స్కామ్ పై దమ్ముంటే విచారణ చేయండని సవాల్ విసిరారు. తీరా అచ్చెన్నాయుడు అరెస్టయ్యేసరికి కక్షసాధింపు అంటున్నారు. అమరావతి భూముల విషయంలో కూడా ఇలానే జరుగుతుంది. ఎవ్వర్నీ ఉపేక్షించేది లేదు.”
ఇలా ఉన్నది ఉన్నట్టు కుండబద్దలుకొట్టారు బొత్స. కరకట్టపై ఎందుకు అన్ని మార్పులు చేయాల్సి వచ్చిందో.. సీఆర్డీఏ హద్దుల్ని ఎందుకు అన్నిసార్లు మార్చాల్సి వచ్చిందో.. చంద్రబాబు వియ్యంకుడి భూముల్ని సీఆర్డీఏ పరిథి నుంచి ఎందుకు తప్పించాల్సి వచ్చిందో చెప్పాలని బాబును డిమాండ్ చేశారు బొత్స. వీటన్నింటిపై సమగ్ర విచారణ జరుగుతుందన్నారు.