అల్లర్లు, హత్యాయత్నం కేసులో టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. టీడీపీ హయాంలో మాజీ మంత్రి, నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిపై బీటెక్ రవి సంచలన విజయం సాధించారు.
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని కసనూరుకు చెందిన బీటెక్ రవి అంచెలంచెలుగా ఎదుగుతూ ఏకంగా వైఎస్ తమ్ముడినే ఓడించి రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు.
ఇదిలా ఉండగా, చెన్నై విమానాశ్రయంలో రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు కడప ఎస్పీ అన్బురాజన్ మీడియాకు తెలిపారు. 2018లో పులివెందుల పూల అంగళ్ల వద్ద అల్లర్లు, ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
ఆ కేసులో ప్రధాన నిందితుడైన బీటెక్ రవిపై వారెంట్ పెండింగ్‌లో ఉన్నట్టు ఎస్పీ వెల్లడించారు. ఆ కేసులో అరెస్ట్ కాకపోవడంతో పాటు బెయిల్ కూడా తీసుకోకుండా బీటెక్ రవి ఇంత కాలం తప్పించుకు తిరుగుతున్నట్టు ఎస్పీ చెప్పారు.
రెండేళ్ల నాటి ఘటనలో ఎస్ఐ చిరంజీవికి గాయాలైనట్టు ఎస్పీ చెప్పారు. హత్యాయత్నం కింద బీటెక్ రవితో పాటు మరో 63 మందిపై కేసులు నమోదయ్యాయని ఎస్పీ తెలిపారు.
కొందరికి బెయిల్ వచ్చిందన్నారు. నాటి ఘటనకు సంబంధించిన కేసులో బీటెక్ రవిని నేడు అరెస్ట్ చేశామన్నారు. అయితే మీడియాలో ప్రచారమవుతున్నట్టు లింగాల మహిళ హత్య కేసుకు, అరెస్ట్‌కు ఎలాంటి సంబంధం లేదని ఎస్పీ స్పష్టం చేశారు.