బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం చేస్తాడని ఎవరైనా అనుకుంటారు. కానీ ఆ చదువును దొంగతనాల కోసం వాడుతాడని అస్సలు ఊహించలేదు. ఇంజినీరింగ్ చేసిన ఓ వ్యక్తి అదే పని చేశాడు. జల్సాలకు అలవాటుపడిన ఇతడు, తన చదువును మోసాలకు ఉపయోగించుకోవడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఊచలు లెక్కబెడుతున్నాడు. హైదరాబాద్ లో జరిగింది ఈ ఘటన.
భీమవరంకు చెందిన మహేష్ బీటెక్ పూర్తిచేశాడు. ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాడు. మొబైల్ టెక్నీషియన్ గా పనిచేస్తూ నకిలీ తాళాలు తయారుచేయడం నేర్చుకున్నాడు. ఆ టెక్నాలజీతో షాపులు ఓపెన్ చేసి దొంగతనాలకు పాల్పడ్డాడు. పోలీసులకు దొరికిపోవడంతో తిరిగి భీమవరం వెళ్లిపోయాడు.
ఈసారి మరింత కొత్త టెక్నాలజీని నేర్చుకున్నాడు మహేష్. రూమ్ షేరింగ్ యాప్స్ సహాయంతో హైదరాబాద్ లని పలు ప్రాంతాల్లో రూమ్స్ తీసుకున్నాడు. తన రూమ్ మేట్స్ కు చెందిన పాన్ కార్డు, ఆధార్ కార్డులతో పాటు డబ్బు దొంగిలించి పరారయ్యేవాడు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.
పోయిన డబ్బు కంటే, పోగొట్టుకున్న గుర్తింపు కార్డులతో బాధితులు ఎక్కువగా ఇబ్బందులు పడ్డారు. అదెలాగంటే.. దొంగిలించిన గుర్తింపు కార్డుల్ని మహేష్ మార్ఫింగ్ చేసేవాడు. ఆ ఐడెంటిటీ కార్డులకు తన ఫొటో తగిలించి వాహనాలు అద్దెకు తీసుకోవడం మొదలుపెట్టాడు. అలా తీసుకున్న వాహనాల నుంచి జీపీఎస్ ట్రాకింగ్, నంబర్ ప్లేట్లు తొలిగించి అమ్మేసి జల్సాలు చేసుకునేవాడు.
రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ తో మొదలైన ఇతగాడి దొంగతనం ఏకంగా ఇన్నోవా కారును దొంగిలించడం వరకు వెళ్లింది. కారు మిస్సింగ్ అంటూ కంపెనీ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. మహేష్ ను పట్టుకున్నారు. అతడ్ని పట్టుకున్న తర్వాత పెద్ద హైటెక్ దొంగ అనే విషయాన్ని తెలుసుకున్నారు. ఇతడి దగ్గర్నుంచి ఏకంగా 7 వాహనాలు సీజ్ చేశారు.