రాయలసీమ జిల్లాల్లో ఒక దశలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపించింది. జూన్ మొదటి వారంలో సింగిల్ డిజిట్ స్థాయిలో కేసులు బయటపడగా.. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది.
జూలైలో అయితే భయానకమైన పరిస్థితులు నెలకొన్నాయి. రాయలసీమ నాలుగు జిల్లాల్లో ఆ దశలో ఒక్కో జిల్లాలో రోజుకు వెయ్యికి అటూ ఇటూ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. కరోనా లాక్ డౌన్ మినహాయింపులు మొదలయ్యాకా నాలుగు జిల్లాల్లోనూ కేసుల సంఖ్య ఒకే స్థాయిలో పెరుగుతూ పోయింది.
మినహాయింపులు కొనసాగుతూ ఉండటంతో కేసులు వేగంగా వ్యాపించాయి. దీంతో మళ్లీ లాక్ డౌన్లు విధించాల్సి వచ్చింది. కేసుల తీవ్రతను పట్టి ఒక్కో పట్టణానికి ప్రత్యేకమైన లాక్ డౌన్లు విధించారు. కేసులు బాగా ఎక్కువగా ఉన్న చోట రెండు రోజులకు ఒకసారి, నాలుగైదు గంటలు మాత్రమే ప్రజలను బయటకు వదిలారు పోలీసులు. మిగతా సమయాల్లో కర్ఫ్యూను తలపించే లాక్ డౌన్ ను అమలు చేశారు.
అప్పటికే కరోనా వైరస్ పల్లెలకు కూడా పాకిపోయింది. చిన్న చిన్న పల్లెల్లో కూడా పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి! జూలై, ఆగస్టు నెలల్లో ఆ పరిస్థితి కొనసాగింది.
కఠినమైన లాక్ డౌన్లు ప్రజలను మరింత ఇబ్బంది పెట్టాయి. అటు కరోనా భయం, ఇటు లాక్ డౌన్ ఒత్తిడితో రాయలసీమ ప్రాంత ప్రజానీకం తీవ్ర ఇబ్బందుల పాలయ్యింది. మరి అలాంటి పరిస్థితుల నుంచి క్రమక్రమంగా మార్పు వచ్చింది. కేసుల సంఖ్య విషయంలో ఇప్పుడు పూర్తి మార్పు కనిపిస్తూ ఉండటం గమనార్హం.
రోజుకు వెయ్యి స్థాయిలో కేసులు నమోదైన జిల్లాల్లో.. ఇప్పుడు రెండు వందల స్థాయిలో కొత్త కేసులు వస్తున్నాయి. రికవరీలు భారీగా నమోదయ్యాయి. 90 శాతం స్థాయిలో రికవరీ కేసులు కనిపిస్తూ ఉన్నాయి.
కరోనా ఈ జిల్లాల్లో కొందరి జీవితాల్లో చీకటిని మిగిల్చినా.. ఇప్పుడిప్పుడు కరోనా భయాలు తగ్గుతున్నాయి. ప్రజలు చాలా ధైర్యంగా బయట తిరుగుతున్నారు. మాస్కులు కొందరు ధరిస్తున్నారు, మరి కొందరు వాటిని కూడా పట్టించుకోవడం లేదు. స్ట్రీట్ ఫుడ్ దగ్గర కూడా ప్రజలు కనిపిస్తున్నారు. పానీపురీ బండ్ల వద్ద కూడా జనాలు మూగుతున్నారు. ఇలా కరోనా ఫియర్స్ నుంచి జనాలు పూర్తిగా బయటపడ్డారు.
ఒక్కో జిల్లాలో రోజుకు రెండు వందల స్థాయిలో కేసులు వస్తున్నా.. ప్రజలు మాత్రం కరోనా ఫియర్స్ నుంచి పూర్తిగా బయటపడిన పరిస్థితి కనిపిస్తోంది. కరోనా పూర్తిగా తగ్గిపోయిందో లేదో కానీ.. ప్రజలు మాత్రం ఆ వైరస్ పట్ల మరీ భయంతో అయితే లేరని క్షేత్ర స్థాయి సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.