3 రోజుల కిందట కురిసిన భారీ వర్షాల నుంచి హైదరాబాద్ ఇంకా తేరుకోలేదు. లోతట్టు ప్రాంతాల నుంచి వరద నీరు ఇంకా బయటకు పోలేదు. ఇళ్లన్నీ ఇంకా ముంపులోనే ఉన్నాయి. అంతలోనే మళ్లీ ఉరుములు-మెరుపులు-భారీ వర్షం. శనివారం రాత్రి హైదరాబాద్ లో వర్షం మరోసారి దంచికొట్టింది. ఫలితంగా అప్పటికే మునిగిన ప్రాంతాలు మరింత మునిగిపోగా, ఈసారి మరికొన్ని ప్రాంతాలు వరద ముందుకు గురయ్యాయి.
నిన్న సాయంత్రం 7 గంటల నుంచి ఈరోజు ఉదయం 5 గంటల వరకు హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది. దీంతో హైదరాబాద్ మరోసారి గజగజ వణికింది. హయత్ నగర్, ఉప్పల్, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, మలక్ పేట, మీర్ పేట, చార్మినార్, బాలాపూర్ ప్రాంతాలు తడిసిముద్దయ్యాయి. బాధాకరమైన విషయం ఏంటంటే.. 3 రోజుల కిందట ఏ ప్రాంతాల్లోనైతే భారీ వర్షం కురిసిందో, రాత్రి మళ్లీ అవే ప్రాంతాల్ని వర్షం ముంచెత్తింది. దీంతో మరిన్ని ఏరియాలు నీట మునిగాయి.
రాత్రి కురిసిన వానతో మరోసారి హైవేలు బంద్ అయ్యాయి. హైదరాద్-విజయవాడ హైవేను మరోసారి పాక్షికంగా మూసేశారు. వరంగల్-హైదరాబాద్ హైవేపై కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ఉప్పల్ చెరువు పూర్తిగా నిండి ప్రమాదకర స్థాయికి చేరడంతో యాదగిరిగుట్ట, వరంగల్ వైపు వెళ్లే వాహనాలన్నీ నిలిచిపోయాయి. విజయవాడ వైపు వెళ్లాల్సిన వాహనాలు సిటీలోనే రాత్రంతా నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు.
ఇక హైదరాబాద్ లో రోడ్లు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సిటీలో కీలక ప్రాంతాలుగా చెప్పుకునే ఖైరతాబాద్, అమీర్ పేట్, లక్డీకపూల్, కోఠి, కేపీహెచ్ బీ, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఏరియాల్లో అస్సలు రోడ్డు కనిపించలేదు.
రహదారులన్నీ నీళ్లతో నిండిపోయాయి. మరీ ముఖ్యంగా గడిచిన రెండేళ్లలో సిటీలో ఎక్కడెక్కడ ఫ్లై ఓవర్లు కట్టారో.. ఆ ప్రాంతాలన్నీ పూర్తిగా నీటమునిగాయి. పైన ఫ్లై ఓవర్లు కట్టి, కింద రోడ్డును దానికి సంబంధించిన డ్రైనేటీ వ్యవస్థను పట్టించుకోకపోవడంతో ఈ దుస్థితి తలెత్తింది.
హైదరాబాద్ కు మరో 2 రోజులు ఇంకా ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈరోజు కాస్త తెరిపినిచ్చినా, సోమవారం మళ్లీ భారీ వర్షాలు పడే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.