దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాల అమల్లో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోంది. ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. నాణేనికి రెండో వైపు చూస్తే అప్పు చేసి పప్పుకూడు తింటే ఏమవుతుందో తాజాగా వెల్లడైన నివేదికలు ఏపీ భవిష్యత్‌పై బెంగ కలిగిస్తున్నాయి. ఏపీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. కాసేపటి క్రితం వెల్లడైన కాగ్ నెలవారీ నివేదిక వివరాలు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
2020 ఏప్రిల్ నుంచి 2021, జనవరి నెలాఖరు వరకు అంటే పది నెలల కాలానికి సంబంధించి కాగ్ తన నివేదికను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఈ పది నెలల కాలంలో ఏకంగా రూ.73 వేల 912 కోట్లు అప్పు చేసింది. దేశంలోనే అత్యధికంగా అప్పులు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డులకెక్కింది. మన కంటే సంక్షేమ పథకాలు ఎక్కువగా అమలు చేస్తున్న రాష్ట్రాలు సైతం ఈ స్థాయిలో అప్పులు చేసిన దాఖలాలు లేవు. ఈ అప్పు కాకుండా ఆర్‌బీఐ నుంచి చేబదుళ్ల కింద దాదాపు రూ.5 వేల కోట్లు అప్పు చేయడం గమనార్హం.
కాగ్ తాజా నివేదిక ప్రకారం పలు రాష్ట్రాల అప్పులను ఒకసారి పరిశీలిద్దాం. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ అప్పు రూ.28,653 కోట్లు, మహారాష్ట్ర అప్పు రూ.31,670 కోట్లు, తమిళనాడు అప్పు రూ.49,844 కోట్లు, కర్నాటక అప్పు రూ.30,229 కోట్లు, సాటి తెలుగు రాష్ట్రమైన తెలంగాణ అప్పు రూ.43,937.95 కోట్లు, పంజాబ్ గత పది నెలల కాలంలో చేసిన అప్పు కేవలం రూ.9,928 కోట్లు మాత్రమే. తెలంగాణలో ఏడాదికి ప్రతి ఎకరాకు రూ.10 వేలు చొప్పున ఎంత భూమి ఉంటే అంత సొమ్ము కేసీఆర్ ప్రభుత్వం అందజేస్తోంది. ఆంధ్రప్రదేశ్ చేసిన అప్పు ఓ పది చిన్న రాష్ట్రాల అప్పుతో సమానంగా ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక రాష్ట్ర ఆదాయానికి సంబంధించి కాగ్ వెల్లడించిన వివరాలను తెలుసుకుందాం. ప్రతినెలా ఒకటో తేదీనే పింఛన్ల పంపిణీకి విపరీతమైన ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం, అదే ప్రాధాన్యత రాష్ట్ర ఆదాయ వనరులను పెంచుకోవడంలో చూపకపోవడం తీవ్ర నష్టాలను తీసుకొస్తోంది. ప్రధానంగా రాష్ట్రానికి మూడు మార్గాల్లో ఆదాయం వస్తుంది.
జీఎస్టీ, వస్తు సేవల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం 56.82 శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం సాధించింది. ఇక మిగిలింది కేవలం రెండు నెలల సమయం మాత్రమే. స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ (భూముల అమ్మకం) ద్వారా పది నెలల కాలంలో 67.47 శాతం ఆదాయాన్ని పొందగలిగింది. ఇంకా 33 శాతం ఆదాయాన్ని రెండు నెలల్లో సాధించాల్సి ఉంది. పెట్రోల్, డీజిల్ అమ్మకాల ద్వారా 53.36 శాతం మాత్రమే ఏపీ గవర్నమెంట్ అచీవ్ కాగలిగింది. ఒక వైపు పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ, మన ఆదాయాన్ని మాత్రం పెంచుకోలేకపోతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక మిగిలిన రెండు నెలల కాలంలో 46.64 శాతం ఆదాయాన్ని ఏ రకంగా పెంచుకుంటుందో ఆ దేవునికే తెలియాలి.
ఇక్కడ ఆశ్చర్యకరమైన మరో విషయం గురించి చెప్పుకోవాలి. దేన్నైతే నిషేధించాలని ప్రభుత్వం కోరుకుంటున్నదో అదే సర్కార్‌ను ముందుకు నడిపిస్తోంది. మద్యపాన విక్రయాల ద్వారా మాత్రం ఆర్జించిన ఆదాయం టార్గెట్‌కు మించి ఇప్పటికే 14 శాతం ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకోవడం గమనార్హం. ఇంకా రెండు నెలల కాలంలో మరింతగా ఆదాయాన్ని లిక్కర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పొందనుంది. మనిషికి మత్తు, ప్రభుత్వానికి ఆదాయ కిక్కు అనే చందంగా మద్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఏపీలో విరాజిల్లుతోంది.
ఇదిలా ఉండగా కేంద్రం నుంచి రాష్ట్రానికి పన్నుల వాటా కింద రావాల్సిన సొమ్ము గురించి కూడా కాగ్ నివేదిక బయట పెట్టింది. పది నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.22,506 కోట్లు రావాల్సి ఉంది. కానీ ఇంత వరకూ కేంద్రం నుంచి వచ్చిన సొమ్ము రూ.11,313.96 కోట్లు మాత్రమే. ఇంకా రావాల్సిన మొత్తం రూ.11,192.04 కోట్లు. కేంద్రం నుంచి హక్కుగా పొందాల్సిన పన్నుల వాటాలో సగం మాత్రమే ఆంధ్రప్రదేశ్‌కు రావడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్రాన్ని ప్రశ్నించే, నిలదీసే దమ్ము, ధైర్యం లేకపోవడం వల్లే ఏపీ ప్రయోజనాల విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఇలాగైతే అంతిమంగా ఆంధ్రప్రదేశ్ సమాజం తీవ్రంగా నష్టపోదా? అభివృద్ధి ఆగిపోదా?
ఇక ఏపీ ద్రవ్య లోటు ఎంతో తెలిస్తే గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ద్రవ్య లోటు 35 శాతం నమోదు కావడం గమనార్హం. సాధారణంగా 5 శాతం ద్రవ్య లోటు దాటకూడదని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. అధ్వానం అనుకుంటే 15 లేదా 20 శాతం ద్రవ్య లోటు ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అన్ని అధ్వానపు రికార్డులను దాటి 35 శాతం నమోదైంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా తీసేందుకు మరెంతో దూరంలో లేదనే వాస్తవాన్ని ద్రవ్యలోటే చెబుతోందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఏపీ ఆర్థిక సంక్షోభంపై జీవీరెడ్డి ఏమంటున్నారంటే…
కేవలం సంక్షేమ పథకాలను అమలు చేయడం వల్లే ఆంధ్రప్రదేశ్ అప్పులపాలు అవుతోందా? అనే ప్రశ్న తలెత్తకుండా ఉండదు. ఈ విషయమై ఏపీ పీసీసీ అధికార ప్రతినిధి జీవీరెడ్డి చక్కటి విశ్లేషణ చేశారు. మన రాష్ట్రంతో సమానంగా లేదా కొంచెం అటుఇటుగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రాలు దేశంలో ఉన్నాయన్నారు. కానీ ఏపీ విషయానికి వస్తే ఆదాయ వనరులను పెంచుకోవడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు.
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ఉన్న శ్రద్ధ, ఆదాయాన్ని పెంచుకోవడంలో కనబరచలేదని ఆయన విమర్శించారు. అందుకే రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చిందన్నారు. ఇప్పటికైనా జగన్ సర్కార్ మేల్కొని ఆర్థిక పరిస్థితిని చక్క దిద్దుకోకపోతే పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందని ఆయన హెచ్చరించారు.
సొదుం రమణారెడ్డి