సీబీఐపై కేసు.. టీడీపీలో పండగ! ఎందుకంటే..

పృష్ట తాడనాత్ దంత భంగః అని సామెత. వీపు మీద కొడితే మూతిపళ్లు రాలుతాయంటుంది శాస్త్రం. ఆ రకంగా.. ఎవ్వరో సీబీఐ అధికారి మీద పోలీసులు కేసు నమోదు చేస్తే.. అందులో టీడీపీ నాయకులు…

పృష్ట తాడనాత్ దంత భంగః అని సామెత. వీపు మీద కొడితే మూతిపళ్లు రాలుతాయంటుంది శాస్త్రం. ఆ రకంగా.. ఎవ్వరో సీబీఐ అధికారి మీద పోలీసులు కేసు నమోదు చేస్తే.. అందులో టీడీపీ నాయకులు పండగ చేసుకోవడానికి ఏముంది? అనే సందేహం ఎవ్వరికైనా కలుగుతుంది! కానీ.. ఈ విషయంలో నిజంగానే టీడీపీ పండగ చేసుకోడానికి కొన్ని కారణాలున్నాయి. అవేంటో అర్థం కావాలంటే.. సావధానంగా ఈ కథనం చదవాల్సిందే..

ముఖ్యమంత్రి జగన్ బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ ముమ్మరంగా దర్యాప్తు సాగిస్తున్న సంగతి తెలిసిందే. లీకుల పేరుతో.. వైఎస్ అవినాష్ రెడ్డి హత్య వెనుక సూత్రధారి అనే అనుమానాలు జనంలో పుట్టేలా ఇప్పటికే మీడియాలో పలురకాల కథనాలు వస్తున్నాయి. 

సీబీఐ దర్యాప్తు కార్యకలాపాలు నిరాటంకంగా సాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గజ్జల ఉదయకుమార్ రెడ్డి అనే వ్యక్తి కూడా ఈ కేసులో నిందితుడు. సీబీఐ అధికారులు ఇతడిని కూడా ప్రశ్నించారు. అయితే తనను తప్పుడు సాక్ష్యం చెప్పమని ఒత్తిడి చేస్తున్నారని, బెదిరిస్తున్నారని, దాడి చేశారని ఆరోపిస్తూ సదరు ఉదయ్ కుమార్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. 

ఆ రకంగా చేస్తున్న అధికారి ఎవ్వరో అతని మీద కేసు నమోదు చేయాలని కోర్టు సహజంగానే ఒక ఉత్తర్వు ఇచ్చేసింది. పర్యవసానంగా కడప జిల్లాలో ఏపీ పోలీసులు.. వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఎఎస్పీ రామ్‌సింగ్ మీద కేసు నమోదు చేశారు. 

కోర్టు ఉత్తర్వుల మేరకే ఈ కేసు నమోదు జరిగింది. అయితే రామ్ సింగ్ దీనిపై హైకోర్టును ఆశ్రయించారు. తర్వాతి చర్యలు ఏమీ తీసుకోకుండా ఆగమని హైకోర్టు చెప్పింది.

ఇంతవరకు జరిగిన క్రమం. అయితే ఇందులో టీడీపీనేతలు పండగ చేసుకునే పాయింట్ ఒకటుంది. తమ పార్టీ వారిని రాష్ట్రంలో పోలీసులు ఎక్కడ విచారణకు పిలిచినా, ఏం అడిగినా వెంటనే వారి మీద ఈ తరహా కేసులు పెట్టేయవచ్చునని వారు స్కెచ్ వేసుకుంటున్నారు. 

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను అప్రతిష్ట పాల్జేయడానికి తెలుగుదేశం ఒక వ్యూహం ప్రకారం మాట్లాడుతూ ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. టీడీపీ నేతలు ఎక్కడ ఏ కేసుల్లో ఇరుక్కున్నా, ఏ నేరాలకు పాల్పడినా.. పోలీసులు రాజకీయ కక్షసాధింపుకు పాల్పడుతున్నట్లుగా పార్టీ చిలకపలుకులు వల్లిస్తుంటుంది. అయినా వారి ఆకతాయి పనులకు కేసులు యథావిధిగా సాగిపోతున్నాయి. 

ఇకమీదట .. కేసుల విచారణల్లో ఏం జరిగిందో తెలుసుకోడానికి పోలీసులు పిలిచినా సరే.. ఆ పోలీసుల మీదనే.. 195ఏ సెక్షన్ కింద కేసు పెట్టాల్సిందిగా కోర్టును ఆశ్రయించాలనేది టీడీపీకి తాజాగా పుట్టిన ఆలోచన! కోర్టు ద్వారా అయితే.. ఒక స్టేషన్ పోలీసుల మీద మరో స్టేషన్ లో కేసులు నమోదు చేయాల్సిందే. 

చచ్చినట్టు ఆ పోలీసులు మళ్లీ కోర్టుకు వెళ్లి చర్యలు సాగకుండా ఉత్తర్వులు తెచ్చుకోవాలి. రాజకీయంగా వీరికి మైలేజీ వస్తుంది. పోలీసులను చికాకు పెట్టినట్టు ఉంటుంది. అందుకే ఇలాంటి మార్గం ఎంచుకోవాలని, ఈ సీబీఐ రామ్ సింగ్ ఘటన భలే ఐడియా అందించిందని వారు అనుకుంటున్నారు.